వానాకాలంలో రాష్ట్రంలోని 60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని... నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ నేతృత్వంలో... రాష్ట్ర స్థాయి సాగునీటి సమీకృత ప్రణాళికా, నిర్వహణా కమిటీ సమావేశం... హైదరాబాద్ జలసౌధలో జరిగింది. ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు సమావేశంలో పాల్గొన్నారు. వానాకాలంలో వివిధ ప్రాజెక్టులు, చెరువుల కింద సాగునీరు అందించే ప్రణాళికపై... సమావేశంలో చర్చించి ఖరారు చేశారు.
భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా... 45 లక్షల ఎకరాలకు, చెరువుల ద్వారా మరో 15 లక్షల ఎకరాలకు... మొత్తం 60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రాజెక్టుల వారీగా కూడా సాగునీటి విస్తీర్ణాన్ని ఖరారు చేశారు. అత్యధికంగా ఎస్సారెస్పీ మొదటి దశ కింద 9.68 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్ కింద 6.58 లక్షలు, ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా 3.72 లక్షలు, కాళేశ్వరం ద్వారా మూడు లక్షల ఎకరాలకు వానాకాలంలో సాగునీరు అందనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు చెరువులు నింపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని మరోమారు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.