దేశంలో గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్ రంగాల సమగ్ర అభివృద్ధిలో మీడియా గణనీయమైన పాత్ర పోషించాలని ఆకాశవాణి, దూరదర్శన్ సౌత్ జోన్ అదనపు సంచాలకులు డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో జాతీయ గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్ సంస్ధ - ఎన్‌ఐఆర్‌డీపీఆర్ 61వ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా జరిగిన 4వ జాతీయ గ్రామీణాభివృద్ధి చలన చిత్రోత్సవాన్ని ఆయన ప్రారంభించారు.
గ్రామీణ రంగాల ఉత్పాదకత పెంచటం, ఉపాధి రంగంలో ప్రస్తుతం నెలకొన్న అంతరాలు పూడ్చటంలో సమాచార వ్యాప్తి అత్యంత కీలకమైందని రాజ్‌కుమార్ తెలిపారు. గ్రామీణాభివృద్ధిపై చలన చిత్రాల నిర్మాణం కోసం యువతను ప్రోత్సహించడం.. ఆయా రంగాలల్లో డాక్యుమెంటేషన్ నిమిత్తం ఈ చిత్రోత్సవం ఏటా ఎన్‌ఐఆర్‌డీపీఆర్ నిర్వహిస్తుండటం పట్ల అభినందనలు తెలియజేశారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఉపాధి రంగాల్లో ఆదాయ అంతరం పెరిగిపోతున్న దృష్ట్యా తగ్గించే దిశగా కృషి జరగాలని రాజ్‌కుమార్ సూచించారు. ఈ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలన్నిటినీ దేశవ్యాప్తంగా దూరదర్శన్... సంక్షిప్తంగా ఆకాశవాణి ద్వారా ప్రసారం చేయగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డీపీఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధికా రస్తోగి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.