రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతంలో నిందితుడు సురేష్ కాల్‌డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనకు ముందు, అనంతరం జరిగిన పరిణామాలను అంచనా వేస్తున్నారు. సురేష్ ఎక్కువసార్లు పెద్దనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్లు గుర్తించి.. అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. బాచారం, గౌరెల్లిలో నెలకొన్న భూవివాదాలపైనా ఆరా తీశారు. సంబంధిత భూములకు చెందిన దస్త్రాలు పరిశీలించి తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందిని ప్రశ్నించారు. కార్యాలయం సమీపంలోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. కేసులో ఎటువంటి కీలక ఆధారాలు దొరకకపోగా నిందితుడు ఈ ఘాతుకానికి ఎందుకు ఒడిగట్టాడో ఇంకా స్పష్టత రాలేదు.
వాంగ్మూలమే కీలక ఆధారం..
ఘటన జరిగిన రోజు నిందితుడు సురేష్, విజయారెడ్డి మాత్రమే కార్యాలయ గదిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏం జరిగిందో వారిద్దరికీ తప్ప మరో వ్యక్తికి తెలిసే అవకాశం లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. విజయారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, కాలిన గాయాలతో నాలుగురోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సురేష్ చనిపోయాడు. అతను నోరు విప్పితే కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. సురేష్ మృతితో కేసు మళ్లీ మొదటికొచ్చింది. నిందితుడి నుంచి మేజిస్ట్రేట్ నమోదు చేసిన వాంగ్మూలాన్ని తమకివ్వాలని పోలీసులు కోరారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నిందితుడి వాంగ్మూలం, చరవాణి కీలకంగా మారింది. సురేష్ కాల్‌డేటా ఆధారంగా మరికొందరని పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇదీ చదవండిః తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి