YS Viveka Murder Case Update : ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగనే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘2018లో జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగింది. జగన్ భుజానికి గాయమైంది. అది తన మెడపై తగలాల్సిందని, తాను వేగంగా స్పందించి చేయి అడ్డుపెట్టడం వల్ల చేతికి గాయమైందని జగన్ అప్పట్లో చెప్పారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకుని, హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తనకు చికిత్స చేసిన ఇద్దరు ప్రైవేటు వైద్యులకు అధికారంలోకి వచ్చాక కీలక పదవులు (డాక్టర్ సాంబశివారెడ్డిని మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా, డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిని ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించారు) కట్టబెట్టారు. ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవహారాల్ని పర్యవేక్షించే బాధ్యతల్ని వారికి అప్పగించారు. ఆ దాడి లాగే, ఎన్నికల్లో గెలవడం కోసం మా మామ హత్యకూ జగనే పథక రచన చేసి ఉంటారు’ అని రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
అప్పట్లోనే అనుమానించి ఉంటే..జగన్, అవినాష్‌రెడ్డి ఓడిపోయేవారు
Viveka Son in Law Accuses Jagan :వివేకా హత్యలో కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని మొదట్లో తాము అనుమానించలేదని, అప్పట్లోనే సందేహించి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్, అవినాష్‌రెడ్డి ఓడిపోయేవారని రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘వివేకా చనిపోయాక ఆయన వ్యక్తిగత జీవితం గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేయడానికి 2019 మార్చి 23న నేను, సునీత సైబరాబాద్ పోలీసుస్టేషన్‌కు బయల్దేరాం. అంతలో వైఎస్ భారతి, విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి మా ఇంటికి వచ్చారు.
Viveka Son in Law Testimony : వివేకా హత్యకు సంబంధించి మేం ఏ చేసినా సజ్జలకు చెప్పాలని భారతి సూచించారు. అప్పటికి మాకు కుటుంబ సభ్యులెవరిపైనా సందేహాల్లేవు. అప్పట్లోనే సందేహం వ్యక్తంచేస్తే జగన్, అవినాష్‌రెడ్డి రాజకీయంగా చాలా ఇబ్బంది పడేవారు’ అని పేర్కొన్నారు. ‘వివేకా హత్య జరిగిన రోజు.. జగన్ హైదరాబాద్ నుంచి సాయంత్రానికి పులివెందుల చేరుకున్నారు. విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడాలో సజ్జలతో చర్చించారు. అప్పటికి వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ, అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉన్నట్లుగానీ నాకు, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆ లేఖ గురించి ప్రస్తావించారు. వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ మాట్లాడటం మాకు నచ్చలేదు. అదే విషయాన్ని ఆ తర్వాత ఆయనకు చెప్పాను’ అని రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపోటు
‘2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వివేకాకు అసలు ఇష్టం లేదు. ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. కానీ జగన్ ఒత్తిడి మేరకే పోటీ చేశారు. అప్పట్లో అమెరికాలో ఉన్న నాకు ఎర్ర గంగిరెడ్డి ఫోన్ చేసి... వివేకాను పోటీకి ఒప్పించాలని కోరారు. తెదేపా నాయకులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి చేతులు కలిపారని, వివేకా అయితేనే గెలవగలరని చెప్పారు. ఆ ఎన్నికల్లో తనకంటే బలహీన అభ్యర్థి అయిన బీటెక్ రవిపై కేవలం 30 ఓట్ల తేడాతో వివేకా ఓడిపోయారు. కారణమేమిటని ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేసి అడిగాను. అంతర్గత వెన్నుపోటు కారణమని చెప్పాడు. అప్పటికే అవినాష్‌రెడ్డి కుటుంబానికి ఎర్ర గంగిరెడ్డి దగ్గరయ్యాడని తెలిసింది. ఆ ఎన్నికల తర్వాత ప్రొద్దుటూరులో తన సోదరుడి పేరు మీద ఎర్ర గంగిరెడ్డి రూ.కోటి విలువైన వ్యవసాయ భూములు కొన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాపై గెలిచిన బీటెక్ రవి కాలేజీలో నాకు జూనియర్. ఆ ఎన్నికల్లో వివేకా కోసం కాకుండా, తన కోసం పనిచేసేందుకు శివశంకర్‌రెడ్డికి రూ.70 లక్షలిచ్చానని బీటెక్ రవి నాకు చెప్పారు. మా బంధువులైన భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలతో పాటు, శివశంకర్‌రెడ్డి ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలోని ఓట్లు వివేకాకు పడకుండా చేయడం వల్లే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. వివేకాకు మొదటి నుంచీ ఖర్చు ఎక్కువ. దానధర్మాలు విరివిగా చేసేవారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చడానికి మేం హైదరాబాద్‌లోని రెండు ఇళ్లు, ఒక ఫ్లాటు, హిమాచల్ ప్రదేశ్‌లోని జల విద్యుత్ కేంద్రంలో 10 శాతం వాటా అమ్ముకోవాల్సి వచ్చింది’ అని వాంగ్మూలంలో రాజశేఖర్‌రెడ్డి వివరించారు.
గుండెపోటు అని నేనెప్పుడూ చెప్పలేదు
‘2019 మార్చి 15న నేను సీఐ శంకరయ్యకు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా తెలుగులో రాసి ఉన్న ఒక కాగితాన్ని నాకు సీబీఐ అధికారులు చూపించారు. ఆ రోజు నేను ఎలాంటి స్టేట్‌మెంటూ ఇవ్వలేదు. ఆ రోజు హైదరాబాద్ నుంచి వేకువజామునే బయల్దేరామని, వివేకా హత్య గురించి కృష్ణారెడ్డి ఫోన్ చేసే సమయానికే మేం కర్నూలుకు చేరుకున్నామని రాసి ఉంది. ఆ రోజు ఉదయం 6.15కి కృష్ణారెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి హైదరాబాద్‌లోనే ఉన్నాం. 7.30కి హైదరాబాద్ నుంచి బయల్దేరాం. వివేకా గుండెపోటుతో చనిపోయి ఉంటారని, మంచం మీద నుంచి కింద పడటం వల్లే దెబ్బలు తగిలి ఉంటాయని నేను అన్నట్టుగా రాశారు. అదీ నిజం కాదు. నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 2019 మార్చి 29న పులివెందుల ఎస్‌డీపీవో డి.నాగరాజాకి నేను మరో స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. అదీ నిజం కాదు. దాన్నీ సృష్టించారు. 2019 మార్చి 15న సీఐ శంకరయ్య నాకు నోటీసు ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు. నాకు పోలీసులు ఎలాంటి నోటీసూ ఇవ్వలేదు. కేసును తప్పుదారి పట్టించేందుకే పోలీసులే ఆ తప్పుడు స్టేట్‌మెంట్‌లన్నీ సృష్టించారు’ అని పేర్కొన్నారు.
‘వివేకానందరెడ్డికి, భాస్కర్‌రెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. 2017లో ప్రభుత్వ భూమిని స్థానిక శ్రీకృష్ణ ఆలయ కమిటీకి కేటాయించేలా వివేకా ప్రయత్నించారు. అది అవినాష్‌రెడ్డికి ఇష్టం లేదు. సర్వే జరగకుండా అడ్డుకున్నారు. వివేకా రాజకీయ పరపతి ముందు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి మరుగుజ్జులు. వివేకా అంటే వారు భయపడేవారు. ఆయన ముందు నిలబడాలంటేనే అసౌకర్యంగా భావించేవారు. తాను కుటుంబసభ్యుల కోసం ఎన్ని త్యాగాలు చేసినా వారు తనంటే అసూయతోనే ఉంటున్నారని చనిపోవడానికి 2, 3 నెలల ముందు వివేకా నాతో చెప్పి బాధపడ్డారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడు.. ఆయన, వివేకా ఒకరికి ఒకరు బాసటగా నిలిచేవారు. ఒకరు ఎంపీగా పోటీ చేస్తే, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. అవసరాన్ని బట్టి అటూ ఇటూ మారేవారు. రాజశేఖర్‌రెడ్డి మరణించాక... ఆ స్థానం నుంచి పోటీకి భాస్కర్‌రెడ్డి పేరును జగన్ ప్రతిపాదించారు. కానీ వివేకాకు అది ఇష్టంలేదు. విజయమ్మగానీ, జగన్‌గానీ పోటీ చేయాలని వివేకా సూచించారు. దాంతో వారి మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. అలాగే భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిల అభిమతానికి విరుద్ధంగా వివేకా ఒక భూ వివాదం సెటిల్‌మెంట్‌లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వారు మరింత కక్ష పెంచుకున్నారు’ అని తెలిపారు.
రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు
‘వివేకా హత్య జరిగిన రోజు కడప మాజీ మేయర్ సురేష్, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఒక కంప్లెయింట్ రాసుకుని వచ్చి, నా భార్య సునీతను సంతకం పెట్టాలన్నారు. దానిలో తెదేపా నాయకులు సతీష్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి పేర్లను అనుమానితులుగా పేర్కొన్నారు. ఆ కంప్లయింటు సరైన పద్ధతిలో లేదని చెప్పి దానిపై సంతకం చేయడానికి సునీత నిరాకరించారు. ఆ ముగ్గురూ తెదేపా నాయకులు కావడంతో ఈ నేరం వారే చేశారనడానికి నిర్ధిష్టమైన ఆధారమేదీ లేకపోయినా, కేసును రాజకీయ కోణంలో మలుపు తిప్పుతున్నారని గుర్తించడం ఆమె సంతకం చేయక పోవడానికి ప్రధాన కారణం. తండ్రిని కోల్పోయిన ఆమెకు ఆ సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదు. ఆ తర్వాత రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆ ముగ్గురిపై అనుమానం ఉందని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్‌ను వైకాపా నీరుగార్చింది’ అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆయనపై చర్యలు తీసుకోవాలి
‘నా తండ్రి హత్య వెనుక కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి హస్తం ఉంది. ఆయన్ను విచారించాలి. ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న కుట్రదారుల్ని బయటపెట్టాలి’’ అని పేర్కొంటూ.. మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి కుమార్తె ఎన్.సునీత రాష్ట్రపతికి, లోక్‌సభ స్పీకర్‌కు, ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు. ఈ హత్య ఘటనలో అవినాష్ ప్రమేయం ఎలా ఉందనే అంశాల్ని ఆ లేఖలో వివరించారు.