Tension at TS Assembly : తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు యత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్ మత్స్యకార విభాగం, వీఆర్‌ఏ, టీచర్ల సంఘాల ప్రతినిధులు, రెడ్డి సంఘం నేతలు విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. ఇందిరాపార్కు నుంచి వందలాది వీఆర్‌ఏలు ర్యాలీగా అసెంబ్లీ వైపు బయల్దేరగా.. ట్యాంక్‌బండ్, రవీంద్రభారతి పరిసరాల్లో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు.
Attempt to besiege Telangana Assembly : ఒక్కసారిగా సంఘాల నేతలు అసెంబ్లీ వైపునకు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పే స్కేల్ పెంచుతామంటూ గతంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చాలని వీఆర్‌ఏలు డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పే స్కేల్‌పై నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Tension at Telangana Assembly News : మరోవైపు మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఫిషరీస్ విభాగం ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తెలంగాణ మత్స్యకారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చేపల టెండర్లను ఏపీ కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ మత్స్యకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Tension at Telangana Assembly Latest News : రూ.2వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ ఆ సంఘం ప్రతినిధులు పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.