Tension at Porus industry: ఏపీలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో.. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు.. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఉత్పత్తిని ఆపాలంటూ.. ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ గేటు తోసుకొని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో మొదటి గేటు వద్ద సెక్యూరిటీ గార్డుపై స్థానికులు దాడి చేయడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పోరస్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అసలేం జరిగింది:
ఏలూరు జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో ఈ నెల 13వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్‌లో మంటలు చెలరేగి.. రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పని చేస్తున్నట్లు సమాచారం. మృతుల్లో నలుగురు బీహార్వాసులుగా గుర్తించారు.
ఇదీ చదవండి: KTR on TRS Plenary: 'పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి'
దిల్లీలో మళ్లీ ఉద్రిక్తత.. విచారణకు వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి