రాష్ట్రంలో చలితీవ్రత బాగా పెరిగింది. రాత్రిపూట గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాబోయే రెండు, మూడ్రోజులు శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాది, ఈశాన్య దిక్కుల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ ప్రభావం వల్ల పలు జిల్లాల్లో చలితీవ్రత విపరీతంగా పెరుగుతన్నట్లు తెలిపింది.
శీతలగాలులు
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో శీతల గాలుల ప్రభావం ఎక్కువ ఉంటుందని వివరించింది. ఈ జిల్లాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇతర చోట్ల 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.
వణికిస్తోంది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. కుమురంభీం జిల్లా గిన్నెదరిలో అత్యల్పంగా 4.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి-టి గ్రామంలో 4.6 డిగ్రీలకు అత్యల్ప ఉష్ణోగ్రతలు పడిపోవడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. గత వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడంలేదు. ఈదురుగాలులతో సాయంత్రం, ఉదయం వేలల్లో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన చలి నుంచి తట్టుకోలేపోతున్నామని జిల్లావాసులు చెబుతున్నారు.
చలిమంటలు
తీవ్రమైన చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు మంటలు వేసుకుంటున్నారు. ఛాయ్ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు.
- ఇదీ చూడండి: చలిని లెక్కచేయకుండా.. సాగుతున్న రైతన్న పోరాటం