Harish Rao at NIMS :పేద ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ నిమ్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు సహా పరికరాలను ప్రారంభించారు. ఆస్పత్రిలో కలియ తిరుగుతూ అన్నింటిని పరిశీలించారు. జన్యుపర వ్యాధుల విశ్లేషణ, గుర్తింపునకు సంబంధించిన సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రోగులకు ఇబ్బంది కలగకుండా పడకల సంఖ్య పెంచతున్నామని హరీశ్ రావు వెల్లడించారు..
Harish Rao at NIMS Hospital: జన్యుపర వ్యాధుల విశ్లేషణ, గుర్తింపునకు నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ల్యాబ్ ఏర్పాటు చేశారు. బోన్ డెన్సిటో మీటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్టీడిస్పిలినరీ రీసెర్చ్ యూనిట్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. జీవనశైలి వ్యాధులపై ఈ యూనిట్‌లో పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు. నిమ్స్‌లో రూ.2.73 కోట్లతో న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్, రూ.40 లక్షలతో అత్యాధునిక న్యూరో ఎండోస్కోపీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
"నిమ్స్‌లో బెడ్ దొరకడం కష్టం. నిమ్స్‌ను మరింత బలోపేతం చేయడానికి అదనంగా 200 పడకలతో ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 155 ఐసీయూ పడకలున్నాయి. జనవరి 15 నాటికి అదనంగా మరికొన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం ఆస్పత్రిలో 89 వెంటిలేటర్లు ఉన్నాయి అదనంగా మరో 120 తీసుకొస్తాం. రేడియోలజీ, బయో కెమిస్ట్రీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాల్లో మరికొన్ని పరికరాలు రావాల్సి ఉంది. వాటన్నింటికి దాదాపు 153 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. 18 కోట్ల రూపాయలతో రోబోటిక్ సర్జరీ మెషీన్ ఇవ్వాలని కోరారు. నిమ్స్‌లో ఆయా పరికరాల కోసం రూ.154 కోట్లు మంజూరు చేస్తున్నాం. పేదవారికి ఉచితంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నాం. త్వరలోనే మరో 4 ఆస్పత్రులు హైదరాబాద్‌లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి."
- హరీశ్ రావు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి
Harish Rao Latest News: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందేలా కృషి చేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సర్కార్ దవాఖానాల్లో వైద్యంపై ప్రజలకు మరింత విశ్వాసం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి పేదబిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కలను సాకారం చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నామని అన్నారు. విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం, ఆపత్కాలంలో వెంటనే టెర్షియరీ కేర్ సేవలు అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Harish Rao on Omicron : "రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచుతున్నాం. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నాం. ఇప్పటికే 94 శాతం వ్యాక్సినేషన్ పూర్తైంది. ప్రతి ఒక్కరు టీకా తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు దానిపైనే దృష్టి సారించారు."
- హరీశ్ రావు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి