Telangana capita power consumption : రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 9.2 శాతం తలసరి విద్యుత్ వినియోగం అవుతోంది. ఈ వివరాలను రాష్ట్ర అర్ధ గణాంకశాఖ తమ నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్ 2021 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 16,613 మెగావాట్ల ఒప్పంద సామర్థ్యం గల విద్యుత్ అందుబాటులో ఉండగా... అందులో 51 శాతం ప్రభుత్వ ఉత్పత్తి, 16 శాతం కేంద్ర ఉత్పత్తి, 33 శాతం ప్రైవేట్ ఉత్పత్తి ఉంది.
టీఎస్ జెన్కో ద్వారా 6,215 మెగావాట్లతో 60.70 శాతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. 39.28 శాతం హైడల్ విద్యుత్, మరో 0.02 శాతం సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం... 2018-19లో 1,896 కిలోవాట్ హవర్ ఉండగా, అది 2019-20 నాటికి 2071కిలో వాట్ హవర్కు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం తర్వాత తలసరి విద్యుత్ వినియోగంలో కేరళ నిలిచింది.
రాష్ట్రాల వారీగా తలసరి విద్యుత్ వినియోగం...
- తెలంగాణ-9.2 శాతం
- కేరళ 9.1 శాతం
- హిమాచల్ ప్రదేశ్ 7.7 శాతం
- వెస్ట్ బెంగాల్ 7.7 శాతం
- హరియాణా 7.1 శాతం
- బిహార్ 6.8 శాతం
- సిక్కిం 6.4 శాతం
- పంజాబ్ 6.1 శాతం
- గోవా 5.4 శాతం
- కర్ణాటక 5.2 శాతం
రాష్ట్రంలో 1.65 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో 72.85 శాతం గృహ విద్యుత్, 15.49 శాతం వ్యవసాయ, 11.66 శాతం పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 24గంటల విద్యుత్ వినియోగం జరుగుతోంది. 25.63 లక్షల వ్యవసాయ వినియోగదారులకు 2014 నుంచి 2021 వరకు ఉచిత విద్యుత్ అందించారు.
హైదరాబాద్లో అత్యధికంగా 17.16 లక్షల గృహ వినియోగదారులు, రంగారెడ్డిలో 14.27, మేడ్చల్లో 12.80 గృహ వినియోగదారులు ఉన్నారు. 4.02 లక్షల పరిశ్రమలు, ఇతర వినియోగదారులు ఉన్నారు. రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో 2.03 లక్షల వ్యవసాయ వినియోగదారులు ఉన్నట్లు అర్ధ గణాంకశాఖ పరిశీలనలో తేలింది.
ఇదీ చదవండి : చలాన్లు ఉన్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల గుడ్న్యూస్!