Telangana Teachers Counselling : తాత్కాలికంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం రాత్రి మళ్లీ మొదలైంది. భార్యాభర్తల(స్పౌస్) కేటగిరీలో తమను ఒకే జిల్లాకు కేటాయించాలంటూ పెద్దసంఖ్యలో విజ్ఞప్తి చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 వేలకుపైగా దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీలించి, పరిష్కరించేంత వరకు కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా ఆపాలంటూ విద్యాశాఖ అధికారులు ఆదేశించడంతో మంగళవారం నిలిచిపోయింది. దాన్ని తిరిగి ప్రారంభించాలని హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి ఆదేశాలు వెళ్లాయి. భార్యాభర్తల జాబితాను తాము బుధవారం రాత్రి పంపిస్తామని, సీనియారిటీ జాబితాను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో కలెక్టర్లు, డీఈవోలు కసరత్తు మొదలుపెట్టారు.
Teachers Counselling in Telangana : ఈ సమాచారం అందడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉరుకులు పరుగులతో కలెక్టరేట్లకు చేరుకున్నారు. వారి సమక్షంలోనే ఉపాధ్యాయులు ఇచ్చిన ఆప్షన్ ఫారాలను అధికారులు పరిశీలిస్తారు. విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా బుధవారం కమిషనరేట్‌లో అప్పీళ్ల ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. ఉపాధ్యాయులు మాత్రం తమ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నారో లేదోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 30వ తేదీ నాటికి అప్పీళ్లను పరిష్కరించాలి. వాటిపై గురువారం మధ్యాహ్నానికి స్పష్టత వస్తుందని తెలిసింది. తాము జిల్లాలో కమిటీకి అప్పీల్ చేసుకున్నా ఆ దరఖాస్తులు ఇక్కడకు రాలేదని వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయురాలు వాపోయారు. అధికారులకు తమ సమస్యను వివరించేందుకు వందల మంది ఉపాధ్యాయులు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు చేరుకున్నారు. కాగా, ఈసారి ప్రతి అంశాన్నీ అధికారులు రహస్యంగా ఉంచుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.