రాష్ట్రంలో ఉదయం 10 గంటల తర్వాత బయటకు వచ్చేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర సేవలు తప్ప ఎవరూ బయటకు వచ్చినా కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు జరిమానాలతో వదిలిపెట్టగా... సీఎం, డీజీపీ ఆదేశాలతో లాఠీలకు పని చెబుతున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు వాహనాలు ఇచ్చేదిలేదని తేల్చి చెబుతున్నారు.
తనిఖీలు చేసిన ఐజీ స్టీఫెన్ రవీంద్ర..
లాక్‌డౌన్ సమయంలో ఎవరూ బయటకు రావొద్దని హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు ఓఆర్ఆర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద స్వయంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ-పాస్‌లను నిబంధనలకు విరుద్ధంగా వాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కరీంనగర్‌లో లాక్‌డౌన్ అమలు తీరును కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో లాక్‌డౌన్‌ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేశారు. అనుమతి లేకుండా బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేశారు. ఖమ్మంలో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు.
నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై వరంగల్ గ్రామీణ జిల్లా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వరంగల్-నర్సంపేట ప్రధాన రోడ్డుపై దుగ్గొండి ఎస్సై రవికిరణ్ వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన కార్లు, బైక్‌లను సీజ్ చేస్తున్నారు. 10 గంటలకు ఇంటికి చేరుకునేలా ముందుగానే దుకాణాలు మూసేయాలన్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని నాగర్‌కర్నూలు జిల్లా పోలీసులు హెచ్చరించారు.
రహదారుల వెంట రాత్రుళ్లు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాత్రి వేళ ఇష్టారీతిగా తిరిగే వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. జంట నగరాల్లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెడుతున్నారు. అత్యవసర వాహనాలు తప్ప... ఏ ఇతర వాహనాలైనా ఉదయం 10 తర్వాత రోడ్డెక్కితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. సరకు రవాణా వాహనాలు రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకే రాకపోకలు సాగించేందుకు అనుమతిస్తున్నారు.
ఇవీచూడండి: ఏపీ నుంచి వచ్చే వారికి ఈ-పాస్ తప్పనిసరి