మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని కొత్వాలికి చెందిన రవి శ్రీవాస్తవ కొడుకు రాహుల్ ఏడేళ్ల వయసులో అంటే 2010, అక్టోబరు 7న రాహుల్ ఇంటి నుంచి తప్పిపోయాడు. అదే నెల 21న పశ్చిమబెంగాల్ హుగ్లీలో అక్కడి పోలీసులకు చిక్కాడు. మతిస్థిమితం సరిగా లేని ఆ బాలుడిని పోలీసులు చేరదీసి.. శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తన కుమారుడు తప్పిపోయాడంటూ బాలుడి తండ్రి అదే సమయంలో కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏళ్లు గడిచినా మధ్యప్రదేశ్ పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఇటు పశ్చిమబెంగాల్ పోలీసులూ బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ కనుక్కోలేకపోయారు.
అలా రెండు రాష్ట్రాల పోలీసులు తేల్చలేని ఈ కేసును తెలంగాణ పోలీసులు ‘దర్పణ్’ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఛేదించారు. ఎట్టకేలకు ఆ బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇళ్ల నుంచి తప్పిపోయి సంరక్షణ గృహాల్లో ఆశ్రయం పొందుతున్న బాలల్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా తెలంగాణ పోలీసులు.. ఫేస్ రికగ్నిషన్ టూల్ (దర్పణ్) ద్వారా పశ్చిమబెంగాల్లోని సంరక్షణ కేంద్రంలో ఉన్న రాహుల్ ముఖ కవళికల్ని పరిశీలించారు. తప్పిపోయిన సమయంలో తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులోని చిత్రంతో సరిపోలడంతో గత మార్చి 16న రెండు రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించారు.
లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా రాహుల్‌ను తరలించడం కుదరలేదు. తాజాగా అక్కడి పోలీసులు రాహుల్‌ను కొత్వాలికి తరలించి ఈ నెల 12న తల్లిదండ్రులకు అప్పగించారు. రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారుల్నే కాకుండా దేశవ్యాప్తంగా సంరక్షణ కేంద్రాల్లోని బాలల్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చడంలో ‘దర్పణ్’ ఉపయుక్తంగా మారిందని తెలంగాణ మహిళా భద్రత విభాగం ఏడీజీ స్వాతిలక్రా తెలిపారు.