రాష్ట్రంలో కరోనా పరిస్థితులుపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఆయా శాఖల అధికారులు ధర్మాసనానికి వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని.. గత నెల 29న ఒక్కరోజే లక్షకు పైగా పరీక్షలు జరిగాయని డీహెచ్ శ్రీనివాసరావు నివేదికలో వివరించారు. రెండో విడత జ్వరసర్వే కొనసాగుతోందని.. సుమారు 68 లక్షల 56 వేల మందికి పరీక్షలు చేసి... చికిత్స కిట్లు ఇచ్చామని నివేదించారు. ప్రైవేట్ ఆస్పత్రులపై ఫిర్యాదుల పరిశీలనకు.. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 79 ఆస్పత్రులకు 115 సంజాయిషీ నోటీసులు ఇవ్వడంతో పాటు.. 10 ఆస్పత్రులకు కరోనా చికిత్సల లైసెన్సులు రద్దు చేసినట్లు డీహెచ్ వివరించారు.
డీహెచ్ వివరణ...
బ్లాక్ ఫంగస్ చికిత్సల కోసం 1500 పడకలు అందుబాటులో ఉన్నాయని.. ఇప్పటి వరకు 744 మందికి ఈ వ్యాధి సోకినట్లు డీహెచ్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ మందులకు దేశవ్యాప్తంగా కొరత ఉందని.. కేంద్రం కేటాయించిన ఔషధాలతో పాటు సొంతంగా కొనుగోలు చేస్తున్నామని డీహెచ్ హైకోర్టుకు తెలిపారు. కరోనా చికిత్సలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 55వేల పడకలు సరిపోతాయని.... ఇంకా పెంచాల్సిన అవసరం లేదని డీహెచ్ వివరించారు. మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామని.. నిలోఫర్ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశామని నివేదికలో వివరించారు. మూడో దశకు అవసరమైన మందులు ముందుగానే కొనుగోలు చేస్తామని.. సిబ్బందికి శిక్షణ ఇస్తామని.. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తామని డీహెచ్ పేర్కొన్నారు.
డీజీపీ వివరణ...
లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయని డీజీపీ ధర్మాసనానికి వివరించారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదు చేసి సుమారు 35 కోట్ల 80 లక్షల జరిమానాలు విధించామన్నారు. కరోనా ఔషధాలు నల్లబజారుకు తరలింపుపై గట్టి చర్యలు తీసుకుంటున్నామని.. ఇప్పటి వరకు 150 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
అన్ని భవిష్యత్లోనేనా...?
తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల్లో ఏమేమి అమలు చేశారు.. వాటి వివరాలు నివేదికలో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల గరిష్ఠ ధరలు సవరిస్తూ..కొత్త జీవో ఇచ్చారా అని ప్రశ్నించింది. రాష్ట్రంలో 14 కొత్త ఆర్టీపీసీఆర్ లేబొరేటరీలు ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తాయని అడిగింది. మూడో దశ సన్నద్ధతపై సమర్పించిన వివరాలు అసమగ్రంగా ఉన్నాయని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భవిష్యత్ చర్యలే తప్ప...ముందస్తు చర్యలేం తీసుకోరా అని అడిగింది. నోడల్ కేంద్రంగా నిలోఫర్ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా.. మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది.
సమయం కావాలి...
లైసెన్సు రద్దు చేసిన ఆస్పత్రులకు బాధితులు చెల్లించిన అధిక ఛార్జీలను తిరిగి చెల్లించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వివరాలు చెప్పేందుకు సమయం కావాలని ఏజీ ప్రసాద్ కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. బ్లాక్ ఫంగస్ చికిత్సల కోసం రాష్ట్రానికి కేటాయించిన ఔషధాలను నాలుగు రోజులుగా ఎందుకు సరఫరా చేయడం లేదో తెలపాలని.... కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది.