తెలంగాణను పూర్తిస్థాయిలో విమానాల తయారీ కేంద్రం(Aero Engines Clusters in Telangana)గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం వీటి రెక్కలు, ఇతర విడిభాగాలు ఇక్కడ తయారవుతున్నాయి. పూర్తిస్థాయిలో విమానాలు మొత్తం ఇక్కడే రూపుదిద్దుకునేలా ఇంజిన్ల తయారీ పరిశ్రమల ప్రత్యేక సమూహం(Aircraft engine manufacturing plant) (ఏరో ఇంజిన్స్ క్లస్టర్(Aero Engines Clusters in Telangana) ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జీఈ ఏవియేషన్, ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ సఫ్రాన్ సంస్థలు ఇంజిన్ల తయారీ పరిశ్రమలను నెలకొల్పాయి. కొత్తగా మరో ఆరు అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రత్యేక సమూహం ఏర్పాటు ద్వారా వీటిని ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ఇప్పటికే వైమానిక, రక్షణ రంగ ఉత్పత్తులకు కేంద్రంగా ఉంది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, కొలిన్స్, యూటీసీ బోయింగ్, సికోర్క్సీ, అదానీ, కల్యాణి తదితర 25 సంస్థలు సాధారణ విమానాలు, ఎఫ్16 యుద్ధ విమానాల రెక్కలు, అపాచీ హెలికాప్టర్ల విడిభాగాలు, డ్రోన్ల తయారీ, సీ-130జే సూపర్ హెర్క్యూలస్ ఎయిర్ లిఫ్టర్, ఎస్-92 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తున్నాయి.

ఇప్పటికే రెండు సంస్థలు

రాష్ట్రంలోని ఆదిభట్లలో తొలుత మూడేళ్ల క్రితం జీఈ ఏవియేషన్ ఇంజిన్ల తయారీ పరిశ్రమను స్థాపించింది. సఫ్రాన్ సంస్థ శంషాబాద్‌లో రూ. 290 కోట్లతో విమానాల లీఫ్ టర్బోఫ్యాన్ ఇంజిన్ల తయారీ పరిశ్రమను నిర్మిస్తోంది. ఈ రెండు పరిశ్రమల ద్వారా 1,000 మందికి ఉపాధి లభిస్తోంది. ఇప్పుడు ఇంజిన్ల తయారీని(Aero Engines Clusters in Telangana) ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో విమానాలు, హెలికాప్టర్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు వైమానిక సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ప్రాట్-విట్నీ, సీఎఫ్‌ఎంలు ముందుకొచ్చాయి. మరో నాలుగు సంస్థలు సైతం త్వరలో తమ ప్రతిపాదనలతో రానున్నాయి. వీటి ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ. 5,000 కోట్ల పెట్టుబడులతో పాటు 3,000 మందికి ఉపాధి లభించనుంది.
అంకురాలకు ప్రోత్సాహం
రాష్ట్రంలో వైమానిక ఆర్థిక మండళ్లు, పార్కులకు తోడు కొత్తగా మరో రెండు పార్కులు ఏర్పాటవుతున్నాయి. విమాన ఇంజిన్ల తయారీ సమూహం(Aero Engines Clusters in Telangana) ఏర్పాటు వల్ల ఈ రంగానికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ఆదిభట్ల, ఎలిమినేడు తదితర ప్రాంతాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. శిక్షణ, పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు అనుమతించనుంది. హైదరాబాద్ పరిశోధన, ఆవిష్కరణ మండలి (రిచ్) వైమానిక, రక్షణ రంగంలో అంకురాలను ప్రోత్సహించనుంది. ఇందుకోసం బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థల సాయం తీసుకోనుంది. ఇప్పటికే వైమానిక విడిభాగాలతో పాటు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్‌లలోనూ తెలంగాణ పురోగమిస్తోంది. త్వరలోనే ఇక్కడ పూర్తిస్థాయి విమానాల తయారీ జరగనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
- ఇదీ చదవండి : అదిరే ఫీట్.. సొరంగాల్లో నుంచి దూసుకెళ్లిన విమానం