Measures to protect twin reservoirs: రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 ఆంక్షలను ఎత్తివేసిన నేపథ్యంలో కార్యాచరణపై రాష్ట్ర పురపాలకశాఖ కసరత్తు ప్రారంభించింది. జీవో 69లో ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. జీవో 111 స్ఫూర్తికి నష్టం కలగకుండా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను పరిరక్షిస్తూ... ఆ పరిధిలోని ప్రాంతాభివృద్ధి ప్రాతిపదికగా కార్యాచరణ ఉంటుందని పురపాలకశాఖ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. పురపాలకశాఖ, జలమండలి, కాలుష్యనియంత్రణ మండలి సమన్వయంతో వ్యవహరించనున్నాయి. జలవనరుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, వాణిజ్య, నివాస జోన్‌ల గుర్తింపుతో పాటు రోడ్ల విస్తరణ, ప్రధాన రహదారులతో అనుసంధానం వంటి కీలకాంశాలపై సీఎస్ నేతృత్వంలోని కమిటీకి నివేదించాల్సి ఉంటుంది. జీవో 69 అమలు కార్యాచరణపై త్వరలోనే రోడ్‌మ్యాప్ సిద్ధం కానుంది.
జల వనరులు కలుషితం కాకుండా చర్యలు
జల వనరులు కలుషితం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు కీలకం కానున్నాయి. జంట జలాశయాల పరిరక్షణకు ఇప్పటికే హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ సమగ్ర నివేదిక అందజేసింది. దీంతో పాటు నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను పరిశీలించి పటిష్ఠ ప్రణాళికను రూపొందించనున్నారు. బఫర్ జోన్ ఎంత మేరకు ఉండాలి? జంట జలాశయాలకు వర్షపునీటిని తీసుకొచ్చే కాలువల వెంట నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడటం.. మూసీ పరీవాహక ప్రాంతంలో పడే వర్షపునీరు నేరుగా జలాశయాల్లోకి చేరడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. నివాస ప్రాంతాల్లోని మురుగునీరు శుద్ధి అయిన తర్వాత జలాశయాల్లోకి చేరకుండా నేరుగా మూసీలోకి వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రధాన కసరత్తు అవుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రాంతాల జోనింగ్
జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో మల్టీపర్పస్‌జోన్, నివాస ప్రాంతాలను నిర్దేశించనున్నారు. ప్రస్తుతం శంషాబాద్ మండల పరిధిలో కొంత మాత్రమే మల్లీపర్పస్‌జోన్ పరిధిలో ఉంది. ఆంక్షల తొలగింపుతో మిగిలిన గ్రామాల్లో ఏ ప్రాంతం బహుళ ప్రయోజన వినియోగ ప్రాంతంగా ఉంటుంది.. ఏది నివాస ప్రాంతంగా ఉండాలి అని ప్రత్యేకంగా నిర్దేశిస్తూ జోనింగ్ చేయాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాల కల్పనపై విస్తృత ప్రణాళిక అవసరం. నివాస ప్రాంతంగా కాకుండా వ్యవసాయ ప్రాంతంగా ఉన్న చోట ఎలాంటి నిబంధనలు ఉండాలి అనేది కూడా నిర్ధారించాల్సి ఉంటుంది. 2031 మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్లపై స్పష్టత ఉంది. వీటి నిర్మాణంతో పాటు ప్రధాన, జాతీయ రహదారులను ఎలా అనుసంధానం చేయాలనే అంశంపై కూడా కసరత్తు చేయాలి. ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో పురపాలక, గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో నిర్మాణ అనుమతులపై ఏకీకృత విధానం అవసరమనే అభిప్రాయంతో అధికారులున్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగ ఏర్పాటు అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జీవో 111 గ్రామాల పరిధిలో ఇప్పటికే వందల లేఅవుట్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత లేఅవుట్‌లకు ఎలాంటి నిబంధనలుండాలి.. కొత్త వాటికి వర్తింప చేయాల్సినవి ఏమిటి? అనే వాటిపై స్పష్టతకు ప్రత్యేక కమిటీని నియమించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.
ఇవీ చదవండి: ఉపాధ్యాయ పదోన్నతులకు పచ్చజెండా... వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు..
రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన గవర్నర్