రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి పెద్ద సంఖ్యలో లిక్కర్ వ్యాపారులు పోటీపడ్డారు. సాయంత్రం నాలుగు గంటల వరకు 42 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. రాత్రి 8.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 42 వేలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారని... ఇంకా ఎక్సైజ్ కార్యాలయాల్లో పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. రాత్రి పొద్దు పోయే వరకు స్వీకరణ కార్యక్రమం కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.800 కోట్లకు పైగా రాబడి వచ్చినట్లు ఆ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.
హైదరాబాద్లో ఒకే ప్రాంతానికి చెందిన వ్యాపారి ఏకంగా 150 దరఖాస్తులు వేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ వ్యాపారి పదిహేను మద్యం దుకాణాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. తిరిగి ఆ దుకాణాలు అన్నింటినీ దక్కించుకోవడానికి లిక్కర్ వ్యాపారి తన దగ్గర పనిచేసే వర్కర్ల ద్వారా దరఖాస్తులు వేయించినట్లు తెలుస్తోంది.