సోమవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్లో సీఎస్ సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలకు తగు నివేదికలతో సిద్ధం కావాలన్నారు. మండలి, శాసనసభలో పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని స్పష్టం చేశారు.
సమన్వయం చేసుకోవాలి
సమావేశాల్లో వచ్చే ప్రత్యేక ప్రస్తావనలు, ప్రశ్నలు, హామీలకు సంబంధించి తగు సమాచారంతో సిద్ధంగా ఉండాలని సీఎస్ తెలిపారు. శాఖల వారీగా సమన్వయ అధికారులను ఏర్పాటు చేసుకొని అసెంబ్లీ అధికారులతో కలిసి పనిచేయాలని చెప్పారు. సమావేశాల్లో సభ్యులు శూన్యగంటలో లేవనెత్తే సమాచారాన్ని ఎప్పటికప్పుడు శాఖలకు అందించి వెంటనే వివరాలు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సోమేశ్ కుమార్ సూచించారు.
అతితక్కువ సమయంలోనే..
ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను సమీక్షించిన సీఎస్... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతితక్కువ సమయంలోనే పదోన్నతులు పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకల నిర్వహణ, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు, కారుణ్య నియామకాలు, రాష్ట్రపతి ఉత్తర్వులపైనా సీఎస్ సమీక్షించారు.
ఇదీ చదవండి : ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు