ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో తీవ్రత తగ్గిందని కేంద్రమంత్రి కూడా చెప్పినట్టు వివరించారు. అందరి సహకారంతో కరోనా గండం నుంచి బయటపడేందుకు అన్ని రకాలుగా యత్నిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. నాలుగైదు రాష్ట్రాలకు హైదరాబాద్ కల్పతరువులా మారిందని పేర్కొన్నారు. కొవిడ్ పరిస్థితులపై మొదటిసారి సమావేశమైన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ... పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించింది. సీఎస్ సోమేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో... కొవిడ్ కట్టడి చర్యలు, మందులు, వైద్య పరికరాల నిల్వలపై సమీక్షించారు.
"రాష్ట్రంలో కొవిడ్ ఔషధాల లభ్యతపై చర్చించాం. కొవిడ్ పరిస్థితులపై కేంద్రానికి అన్ని అంశాలు వివరించాం. ఇంటింటి సర్వే, ఐసోలేషన్ కిట్లతో ప్రాణాలు కాపాడవచ్చు. రాబోయే 3 నెలల కాలానికి అన్ని మందులు సమీకరించుకున్నాం. అవసరం మేరకు రెమ్‌డెసివిర్ తెప్పించుకున్నాం. అదనంగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తెప్పించుకుంటున్నాం. అన్ని ఔషధాలను తెప్పిస్తున్నాం. టీకాల విషయమై కూడా సుదీర్ఘంగా చర్చించాం. రావాల్సిన టీకాల కోటా, గ్లోబల్ టెండర్ల విషయమై చర్చించాం. వ్యాక్సిన్, రెమ్‌డెసివిర్ ఉత్పత్తిదారులతో టాస్క్‌ఫోర్స్ చర్చిస్తుంది."
- కేటీఆర్, మంత్రి
ఆక్సిజన్‌పై ఆడిటింగ్...
నల్లబజారుకు రెమ్‌డెసివిర్ తరలిస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రెమ్‌డెసివిర్ ఇష్టారీతిన వాడవద్దని ప్రైవేటు ఆస్పత్రులకు కూడా చెప్పినట్టు పేర్కొన్నారు. ప్రతి రోజూ ఆక్సిజన్ ఆడిటింగ్ చేస్తున్నామన్న కేటీఆర్.. అవసరానికి మించి ఆక్సిజన్, ఔషధాలు వాడకుండా చూస్తున్నట్టు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కొవిడ్ పరిస్థితులపై మంత్రులు పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
బ్లాక్ ఫంగస్‌పై అప్రమత్తత...
రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయినట్లు తెలిపిన కేటీఆర్... 2.1 లక్షల కిట్లు పంపిణీ జరిగినట్లు వివరించారు. బ్లాక్ ఫంగస్ విషయమై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. అవసరమైన మందులు సమకూర్చుకుంటున్నామన్నారు. కొవిడ్ హెల్ప్‌లైన్ కోసం ఒకే నంబర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మొత్తం 10 లక్షల మందికి పైగా పూర్తి వ్యాక్సిన్ తీసుకున్నాట్లు పేర్కొన్న కేటీఆర్... మరింత సమగ్ర కార్యాచరణతో ముందుకువెళ్తామని వెల్లడించారు.