రాష్ట్రంలో సామాన్యుడికి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అని ఏపీ తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. యువతను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని.. వారికి మద్యంతో పాటు గంజాయి అలవాటు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పల్నాడు ప్రాంతంలో నాటు సారా ఏరులై పారుతోందన్న ఆనంద్ బాబు.. మద్య నిషేధమని చెప్పినవాళ్లే విచ్చలవిడిగా అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రశ్నిస్తే నాకు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహించారు. ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన అన్నారు.
గంజాయి రవాణా గురించి ఎలా తెలుసని పోలీసులు అడిగారు. పత్రికల్లో, మీడియాలో చూసి మాట్లాడానని చెప్పా.మేము ఇచ్చిన వాయిస్‌ను రికార్డు చేసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే ఆధారాలు ఇవ్వాలని అడుగుతారా? మద్యనిషేధం చేస్తామని చెప్పి చివరికీ మీరే మద్యం అమ్ముకుంటున్నారు. ఎక్సైజ్ డిపార్టుమెంట్‌ను నిర్వీర్యం చేశారు. విశాఖ ఏజెన్సీలోనే కాదు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా గంజాయి రవాణా జరుగుతోంది. -నక్కా ఆనంద్ బాబు
ఆధారాలు ఇవ్వాలని అడిగాం: నర్సీపట్నం సీఐ
నల్గొండ జిల్లా పోలీసులు ఏజెన్సీలో కాల్పులు జరిపినట్లు నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. అదేరోజు స్మగ్లింగ్ వెనుక నాయకులున్నారని ఆనంద్‌బాబు చెప్పారని..అందుకే ఆధారాలు ఇవ్వాలని అడిగినట్లు ఆయన తెలిపారు.
ఆనంద్‌బాబు స్టేట్‌మెంట్ రికార్డు చేశాం. ఆధారాలు ఏమీలేవని ఆనంద్‌బాబు చెప్పారు. స్టేట్‌మెంట్‌లో పూర్తి వివరాలు వెల్లడించలేదు. 91 సీఆర్‌పీసీ కింద నోటీసులిస్తామంటే తీసుకోలేదు. నోటీసులు తీసుకోకపోతే ఇంటికి అంటిస్తాం. సమగ్రమైన సమాచారం రాకపోవడంతోనే నోటీసులిస్తున్నాం. - శ్రీనివాసరావు, నర్సీపట్నం సీఐ
ఇదీ చూడండి: