తితిదే పాలకవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోలను ఇప్పటికే ఏపీ హైకోర్టు కొట్టివేయగా.. తాజాగా ఇవాళ సుప్రీంలో కేవియట్ దాఖలైంది. ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకు ఏపీ ప్రభుత్వం, ప్రత్యేక ఆహ్వానితులు ఎవరైనా వెళ్తే సమాచారం ఇవ్వాలని ఉమామహేశ్వరనాయుడు కేవియట్ పిటిషన్ వేశారు.
జీవోలు సస్పెండ్
తితిదే పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నామినేట్ చేస్తూ ఈనెల 15న ఏపీ ప్రభుత్వం జారీచేసిన రెండు జీవోల అమలును ఆ రాష్ట్ర హైకోర్టు నిలుపుదల చేసింది. ఏపీ దేవాదాయ చట్టం సెక్షన్ 96లోని నిబంధనలను ఉల్లంఘించేవిగా జీవోలు ఉన్నాయని అభిప్రాయపడింది. వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ(దేవాదాయ) శాఖ ముఖ్యకార్యదర్శి, తితిదే ఈవో, దేవాదాయశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీనిపై లోతైన విచారణ జరపాలని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం.. రెండు ప్రజాహిత వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఇదీ చదవండి: Ap high court : తితిదే ప్రత్యేక ఆహ్వానితుల జీవోలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే