Gudivada Casino issue: క్యాసినో వ్యవహారంపై నిజనిర్థరణ కోసం ఏపీలోని గుడివాడ వెళ్లిన తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజనిర్థారణ కమిటీ సభ్యులు ఆరుగురితో పాటు. మరో 20మందికిపైగా తెదేపా నేతలపై వివిధ సెక్షన్ల కింద సుమోటోగా పోలీసులు కేసులు పెట్టారు. మరోవైపు..తెదేపా నేత బొండా ఉమా ఫిర్యాదు మేరకు కొడాలి నాని ఓఎస్డీ శశిభూషణ్, ఇతరుల పేరిట పోలీసులు కేసు పెట్టారు. తమపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేస్తే 307 సెక్షన్ కింద కేసు పెట్టకుండా కారు అద్దం పగలగొట్టడానికి మాత్రమే కేసు నమోదు చేయడాన్ని తెదేపా నేతలు తప్పుబడుతున్నారు.
కృష్ణాజిల్లా కలెక్టర్‌ను కలిసిన తెదేపా నిజనిర్ధారణ కమిటీ
కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్‌ను విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెదేపా నిజ నిర్ధారణ కమిటీ బృందం కలిసింది. గుడివాడ క్యాసినో వ్యవహారంపై కలెక్టర్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. తెలుగు సంస్కృతి మీద గుడివాడలో దాడి జరిగిందని నిజ నిర్ధారణ కమిటీ విమర్శించింది. గుడివాడలో అర్ధనగ్న ప్రదర్శనలు, ఎన్టీఆర్ పుట్టిన గడ్డపై అశ్లీలంగా వ్యవహరించారని నిజ నిర్థారణ కమిటీ ఆరోపించింది. తాము జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చేంత వరకు ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని కమిటీ బృందం మండిపడింది. కొడాలి నాని ఓ సంఘ విద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారని, నిజ నిర్దారణ కోసం బృందంగా రక్షణ కల్పించాలని పోలీసులను కోరామన్నారు.
మంత్రి ఓఎస్డీనే బొండా ఉమ కారును దగ్గరుండి ధ్వంసం చేయించారని నిజ నిర్థారణ కమిటీ బృందం తేల్చిచెప్పింది. అరాచకానికి గుడివాడలో పోలీసులు అండగా నిలిచారని... ఏలూరు డీఐజీ పెద్ద అబద్దాల కోరని కమిటీ దుయ్యబట్టింది. నిజ నిర్దారణ బృందం గుడివాడలోని కొడాలి కన్వెన్షన్‌కు వెళ్లేందుకు అనుమతించాలని, కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించానని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుంటానని సవాల్ విసిరారని తెదేపా నిజ నిర్ధారణ కమిటీ బృందం స్పష్టంచేసింది. సవాల్ నుంచి పారిపోయారని, చంద్రబాబే రావాలంటూ ఏదేదో మాట్లాడుతున్నారని కమిటీ పేర్కొంది. క్యాసినో అర్ధనగ్న నృత్యాలు చేయించారని నిరూపిస్తామని నిజ నిర్థారణ కమిటీ స్పష్టంచేసింది. కొడాలి నాని గ్రామ సింహమని, బూతులు తిట్టడానికి తప్ప ఎందుకు పనికి రాడని కమిటీ బృందం ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఇదీ చదవండి: