పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్య లాకప్ డెత్ కేసును సీబీకి అప్పగించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. వెంటనే స్పందించి రంగయ్య కుటుంబాన్ని ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. గవర్నర్‌కు లేఖ రాసిన వారిలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, టీపీసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ ప్రీతం తదితరులు ఉన్నారు.
వన్యప్రాణుల చట్టం కింద గత నెల 24న శీలం రంగయ్యను పోలీసులు అరెస్టు చేసి, పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలీసుల దెబ్బలు తాళలేకే రంగయ్య లాకప్‌లో మరణించినట్లు అనుమానాలున్నాయని చెప్పారు. ఎఫ్ఐఆర్లో 24న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారని, 26న లాకప్‌లో మృతిచెందినట్లు రాశారన్న ఉత్తమ్.. 24న రిమాండ్‌కు వెళ్లిన వ్యక్తి 26న లాకప్‌లో ఎలా చనిపోతాడన్న అంశంపై అనుమానాలున్నాయని తెలిపారు.
రంగయ్య లాకప్ డెత్ విషయంలో హైకోర్టులో పిల్ వేయగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తామని.. మళ్లీ పోలీసులు విచారణ జరిపితే బాధితులకు సరైన న్యాయం జరగదని భావిస్తున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. రంగయ్య లాకప్ డెత్ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అతని కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.