IPS AB Venkateshwar rao: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించడం కుదరదని పేర్కొంది.
అసలేం జరిగింది.. దేశ, రాష్ట్ర భద్రతా వ్యవహారాల్లో నిబంధనల్ని అతిక్రమించారంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును 2020 ఫిబ్రవరిలో సర్వీసు నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జాతీయ, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించేలా ఓ విదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థకు పోలీసు సెక్యూరిటీ ప్రోటోకాల్ వ్యవస్థ వివరాలను అప్పగించారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థతో వెంకటేశ్వరరావు కుమ్మక్కయ్యారని.. నిబంధనలకు వ్యతిరేకంగా నిఘా ఉపకరణాలు కొనుగోలు చేశారని ఆయనపై మోపిన అభియోగాల్లో ప్రభుత్వం పేర్కొంది.
నేనెప్పుడూ చట్ట ప్రకారమే ముందుకెళ్లా : సస్పెన్షన్ రద్దు చేస్తూ.. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. తానెప్పుడూ చట్టప్రకారమే ముందుకెళ్లానని పేర్కొన్నారు. కేసును తప్పుదారి పట్టించిన వారినుంచి రెవెన్యూ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
నేను ఎప్పుడూ చట్ట ప్రకారమే ముందుకెళ్లా. ఎవరి కళ్లలో ఆనందం కోసం ఇదంతా చేశారు? నన్ను, నా కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారు? సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే నేను చేసిన తప్పా? నాపై వాదించే లాయర్లకు రూ.లక్షల ఫీజు చెల్లించారు. అసలు కొనుగోలే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది? కొందరు తప్పుడు కేసులతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారు. తప్పుదారి పట్టించిన వారినుంచి రెవెన్యూ రికవరీ చేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టేది లేదు. ప్రభుత్వానికి, అధికారులకు చట్టాలు, నిబంధనలు తెలియవా? -ఏబీ వెంకటేశ్వరరావు, ఐపీఎస్ అధికారి
సంబంధిత కథనాలు: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎంతకాలం? : సుప్రీంకోర్టు
భారత్-బ్రిటన్ సరికొత్త స్నేహగీతం- 2022లోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం!