కరోనా వేళ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఒక్క విద్యార్థి ప్రాణం కోల్పోయినా..రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని..సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్ (ap govt), కేరళ ప్రభుత్వాలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. రెండ్రోజుల్లో అఫిడవిట్ (affidavit) దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా... ఏపీ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని సుప్రీంకోర్టు నిలదీసింది.
11వ తరగతి పరీక్షలు (exams) సెప్టెంబరులో జరుపుతామని విచారణ సందర్భంగా కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏపీ నుంచి స్పష్టత లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... ఇన్ని రోజులైనా అఫిడవిట్ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. పరీక్షలు జరపాలనుకుంటే అఫిడవిట్ ద్వారా వివరాలు చెప్పాలని ఆదేశించింది. 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా ? లేదా ? స్పష్టంగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది.
ఇదీ చదవండి: KCR: వారానికి 2 గంటలు పనిచేస్తే వాసాలమర్రి అభివృద్ధి జరగదా?