ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఎస్ఎస్బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది(students protest at ssbn aided college). ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య సుమారు గంటపాటు తోపులాట జరిగింది. ఈ క్రమంలో చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. ఘటనతో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ చేశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తలకు గాయమైంది.
పేద విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి తమను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని విద్యార్థులు ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది పేద విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువును అభ్యసిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విలీనం ఆపాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున పాల్గొని ప్రైవేటీకరణ ఆపాలని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు.
ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన ఉద్ధృతం చేశారు. దీంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయాలని ప్రయత్నించారు. విద్యార్థులంతా కలిసి ఒక్కసారిగా పోలీసులను అడ్డుకున్నారు. చదువుకునే విద్యార్థులపై మీ ప్రతాపం అంటూ పోలీసులను నిలదీశారు. ఇంతలో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి, ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి.: Farmer died in Medak district: పొలం పోతుందనే బెంగతో తనువు చాలించిన రైతు