తెలంగాణలో ప్రభుత్వం వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు. డీసీసీ అధ్యక్షులతో సమావేశమైన ఠాగూర్... వివిధ అంశాలపై చర్చించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ... ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రతి నెలా తాను డీసీసీ అధ్యక్షులతో సమావేశమవుతానన్న ఆయన... ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లా కార్యాలయాలు నిర్మించుకోవాలని సూచించిన ఠాగూర్... జిల్లా అధ్యక్షులకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలు జరగవని స్పష్టం చేశారు. ప్రతి నెలా మండల స్థాయిలో నిర్వహించాలని సూచించారు. ప్రతి జిల్లా అధ్యక్షులు రెండు అసెంబ్లీ స్థానాలు గెలిపిస్తే... పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఓటర్లను పార్టీ వైపు ఆకర్శించేట్టు కార్యక్రమాలు ఉండాలని. కార్యకర్తలకు అండగా నిలవాలని సూచించారు.
రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్, బోసురాజుకు బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాసన్‌కు ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం... బోసురాజుకు మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, భువనగిరి కేటాయించారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ కార్యకలాపాలు, నాయకుల మధ్య విబేధాలు, ఇతర కార్యక్రమాలు వీరిద్దరు పర్యవేక్షించనున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: కొత్త బాధ్యుడు.. శ్రేణులను ఏకం చేసేందుకు కసరత్తు