హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్.. పోలీసులను బురిడీ కొట్టించాలన్న పథకం విఫలమయింది. ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యేందుకు ఇష్టంలేని భార్గవరామ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందటూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు. తొలుత నిజమేనని నమ్మిన పోలీసు అధికారులు తర్వాత విచారణ చేపట్టి సాక్ష్యాధారాలు సేకరించారు. కరోనా పాజిటివ్ అంటూ చూపిన రిపోర్ట్ బూటకం అని తేల్చారు.
అసలు ఏం జరిగిందంటే..
కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ భార్గవరామ్ బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌కు గత శనివారం కరోనా పాజిటివ్ రిపోర్టును వాట్సాప్‌లో పంపించాడు. న్యాయస్థానంలో ఈ విషయాన్ని వివరించేందుకు ఇన్‌స్పెక్టర్ రవికుమార్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వచ్చిన వాట్సాప్‌లో పంపిన కరోనా రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించారు. దీన్ని చూసిన ఓ ఉన్నతాధికారి.. అందులో అక్షరాలు, పేర్లలో దిద్దుబాటు ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్కు వివరించారు. ఉన్నతాధికారి ఆదేశాలతో కరోనా పాజిటివ్ రిపోర్టు ఇచ్చిన కూకట్పల్లిలోకి గాయత్రి ల్యాబ్‌కు పోలీసులు వెళ్లారు. వాట్సాప్ సందేశాన్ని.. ల్యాబ్ సిబ్బందికి చూపించగా.. భార్గవరామ్‌కు పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు.
ల్యాబ్ లైసెన్స్ రద్దు..
అనంతరం ల్యాబ్ నిర్వాహకులు.. వినయ్, రత్నాకర్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. తాము రూ.1,200 తీసుకొని పాజిటివ్ రిపోర్టు ఇచ్చామని.. పోలీసులు ఎదుట అంగీకరించారు. నకిలీ ధ్రువపత్రం ఇచ్చిన గాయత్రి ల్యాబ్ లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ వైద్యారోగ్యశాఖకు పోలీసులు లేఖ రాశారు. కరోనా పాజిటివ్ రాకున్నా. వచ్చినట్లు రిపోర్టు తీసుకునేందుకు అఖిలప్రియ భర్త భార్గవరామ్ పదిరోజుల ముందే పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందుకు అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి సహకరించినట్లు గుర్తించారు. కూకట్‌పల్లిలోని ప్రతిమ ఆస్పత్రిలో పనిచేస్తున్న వినయ్ తన స్నేహితుడని.. అతనికి చెబితే పనైపోతుందని.. వారు అడిగినంత డబ్బు ఇచ్చేద్దామని జగద్విఖ్యాత్‌రెడ్డి.. భార్గవరామ్‌కు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.
అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు...
వినయ్ సూచనల మేరకు గాయత్రి ల్యాబ్‌కు వెళ్లిన భార్గవరామ్.. అక్కడ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. నెగిటివ్ వచ్చినా... పాజిటివ్ వచ్చినట్టు వారు రిపోర్టు ఇచ్చారని పోలీసులు గుర్తించారు. ల్యాబ్‌కు వెళ్లి మొత్తం వ్యవహారంపై సాక్ష్యాధారాలు సేకరించారు. భార్గవరామ్ అక్కడ ఏం చేశాడు? నమూనాలను ల్యాబ్ నిర్వాహకులు ఎలా మార్చారు? అన్న అంశాలకు సంబంధించిన సీసీ కెమెరాల పుటేజీలను సేకరించారు. ఒక నమునా బదులు మరో నమూనా ఉంచడం, కొవిడ్ రిపోర్టుపై పాజిటివ్ అంటూ రాయడం వంటి వాటికి సంబంధించిన రుజువులను సేకరించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవరామ్, జగద్విఖ్యాత్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు వెళ్లాయని పోలీసులు తెలిపారు.
ఇదీచూడండి:
BHUMA AKHILA PRIYA: 'కావాలనే తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు'