Civils Rankers: ఉన్నత కుటుంబాలకే సివిల్స్ ర్యాంకు సాధ్యమనే ప్రచారాన్ని తిప్పి కొట్టారు తెలుగు తేజాలు. పట్టుదలకు... పకడ్బందీ ప్రణాళిక ఉంటే.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసెస్ సొంతమవుతాయని నిరూపించారు. భిన్నమైన కుటుంబ, సామాజిక, విద్య నేపథ్యాలున్న తెలుగు ఆడ బిడ్డలు... అద్భుతమైన ఫలితాలను సాధించారు.
సివిల్స్ కోసం అమెరికా నుంచి...
మొదటి అయిదు ప్రయత్నాల్లో ఆమె లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. అయినా పట్టు వదల్లేదు.. ఎనిమిదేళ్లపాటు అలుపెరగకుండా శ్రమించి ఆరో ప్రయత్నంలో తన లక్ష్యం ఐ.ఎఫ్.ఎస్.ని సాధించింది సాహిత్య పూసపాటి.
నాన్న జగదీష్ సూర్యవర్మ.. వ్యాపారి. అమ్మ పద్మజ టీచర్‌గా పనిచేసేవారు. ఇంటర్ వరకూ వైజాగ్‌లోనే చదువుకున్నా. డాక్టర్ కావాలనేది నా లక్ష్యం. కానీ ఎంసెట్‌లో అనుకున్న ర్యాంకు రాలేదు. దాంతో బి.ఫార్మసీ చేశా. తర్వాత అమెరికా వెళ్లి ఎం.ఫార్మసీ చేసి అక్కడే ఒక ఫార్మా కంపెనీలో రెండేళ్లు పనిచేశా. ఆ సమయంలోనే సివిల్స్ ఆలోచన వచ్చింది. పరిపాలనలో వాళ్లది ప్రత్యేక స్థానం. గౌరవ మర్యాదలూ ఎక్కువ. అందుకే ఇటువైపు రావాలనుకున్నా. 2014లో తిరిగొచ్చి వైజాగ్‌లో ఉంటూ ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2015లో మొదటిసారి సివిల్స్ రాశా. తొలి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ కూడా దాటలేదు. నా తప్పులు సరిదిద్దుకుని మూడో ప్రయత్నంలో మెయిన్స్ వరకు వెళ్లా. ఇంకాస్త పోటీ వాతావరణంలో ఉండాలని బెంగళూరులో శిక్షణ కోసం వెళ్లా. తర్వాత వరసగా మెయిన్స్‌కు వెళ్లగలిగా. గతేడాది ఇంటర్వ్యూకి ఎంపికయ్యా. ఆఖరి ప్రయత్నంలో ఆరోసారి 24వ ర్యాంకు వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల ప్రయాణం. మధ్యలో ఎన్నో సందేహాలు, ‘కొనసాగాలా వద్దా’ అని. ఒక్కో ప్రయత్నంలో మెరుగుపడుతూ రావడంతో చివరి ప్రయత్నం వరకూ పోరాడదామనుకున్నా. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఎంచుకున్నా. ఎందుకంటే ప్రపంచస్థాయిలో భారత్ ప్రాబల్యం, ప్రాముఖ్యత పెరుగుతున్నాయి. ఈ సర్వీస్‌లో ఉంటే దేశానికి ప్రపంచస్థాయిలో సేవలు అందించవచ్చు. దానికితోడు నాకు కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త సంస్కృతులు తెలుసుకోవడమూ ఇష్టం. ఆరో ప్రయత్నం ‘ఈసారీ రాకపోతే’ అన్న ఆలోచనలూ వచ్చాయి. ఇది లక్ష్యమే కానీ, జీవితం అనుకోలేదు. ఏం చేసినా జీవితంలో ఉన్నతంగా ఉండాలనుకునేదాన్ని. పుస్తక పఠనం, సినిమాలు నా హాబీలు. నాపైన ఫౌంటయిన్ హెడ్ పుస్తకం ప్రభావం చాలా ఉంది.
అమ్మ కష్టాలకు ఈ విజయం కానుక..
అమ్మా నేను ఐఏఎస్ అవుతా, మన కష్టాల్ని తీర్చుతా... అని చిన్నప్పట్నుంచీ చెబుతుండేది. ఆ మాటల్ని మిగతావాళ్లు తేలిగ్గా తీసుకున్నా తను సీరియస్‌గానే తీసుకుంది. 136వ ర్యాంకుతో లక్ష్యాన్ని అందుకుంది నిజామాబాద్ అమ్మాయి అరుగుల స్నేహ.
మాది సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. అమ్మ, నేను, చెల్లె ఉంటాం. మా బాగోగులు తాతయ్య చూసేవారు. ఆయన పోయాక అమ్మే అన్నీ తానై పెంచింది. మమ్మల్ని పెంచడానికి ఎన్నో కష్టాలు పడింది. ఇంటి వద్ద చిన్న కిరాణా దుకాణం నిర్వహించేది. చీరలు అమ్మేది. కొన్న వారు డబ్బు కట్టక నష్టాలు రావటంతో వ్యాపారం మానేసింది. పొరుగు సేవల కింద కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించింది. ఐఏఎస్ అవుతానని అమ్మతో చిన్నప్పట్నుంచీ చెబుతూ వచ్చా. ఆ మాటను నిజం చేసినందుకు సంతోషంగా ఉంది. పదో తరగతి వరకు నిజామాబాద్‌లో చదివా. ఇంటర్ హైదరాబాద్‌లో, ఇంజినీరింగ్ ఎన్‌ఐటీ నాగ్‌పుర్ నుంచి 2017లో పూర్తి చేశా. సివిల్స్ శిక్షణ కోసం దిల్లీ వెళ్లా. 2017 నుంచి మూడుసార్లు ప్రయత్నించి విఫలమై.. నాలుగోసారి విజయం సాధించా. 2020లో మూడోసారి ఒక్క మార్కులో చేజారటంతో నిరాశ చెందినా ఆత్మస్థైర్యంతో ప్రయత్నించా. ఐఏఎస్ వస్తుందనే అనుకుంటా. ఐఏఎస్ అవుతా అంటే కుటుంబ సభ్యులంతా సరదాగా తీసుకున్నారు. కానీ పెద్దయ్యాక కూడా అదే పట్టుదలను కొనసాగించా. ఆర్థిక ఇబ్బందుల ప్రభావం చదువులపై పడకుండా చూసుకున్నా. చెల్లి సుప్రియ డిగ్రీ వరకు చదివింది. ఆన్‌లైన్‌లో సంగీత పాఠాలు బోధిస్తూ కుటుంబానికి సహాయంగా నిలిచింది. పేదలకు సాయం చేయాలనేది నా లక్ష్యం.
పాపని చూసుకుంటూ చదివా...
అప్పటికే ఆమె డాక్టర్. పెళ్లై పాప కూడా ఉంది. వయసు 30. జీవితంలో బాగా స్థిరపడ్డట్టేే. ఆమె మాత్రం ‘ఒక్కటే జీవితం. దీన్ని సాధ్యమైనంత గొప్పగా తీర్చిదిద్దుకోవాలి’ అనుకుంది. అప్పుడే కలెక్టర్ అయితే డాక్టర్‌కు మించి ప్రజాసేవకు వీలుంటుందనుకుంది. నాలుగేళ్ల శ్రమతో లక్ష్యాన్ని చేరుకుంది డా. కొప్పిశెట్టి కిరణ్మయి.
మా సొంతూరు కాకినాడ దగ్గర వలసపాకల. నాన్న డీఆర్‌డీఏలో ఉద్యోగి. అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఇద్దరూ రిటైరయ్యారు. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. మొదట్నుంచీ ప్రజలకు సేవ చేసే విభాగంలో ఉండాలనేది కోరిక. అందుకే వైద్య రంగంలో అడుగుపెట్టా. ఉస్మానియా నుంచి ఎంబీబీఎస్, ఎం.ఎస్.(జనరల్ సర్జన్) చేశా. 2012-15 మధ్య పీజీ చేశా. అప్పుడే పెళ్లి, ఆపైన పాప. మావారు ఎమ్.విజయ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వంలో గ్రూప్-1 ఆఫీసర్. ఆయన్ని చూశాకే సివిల్స్ ఆలోచన వచ్చింది. నా అభిప్రాయం చెప్పగానే ప్రోత్సహించారు. కానీ ఇంట్లోవాళ్లు ‘ఇప్పుడు ఎందుకు’ అని మొదట అన్నా.. చివరకు అంగీకరించారు. 2017లో ప్రిపరేషన్ మొదలుపెట్టా. అంతలో అమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. అయిదు నెలలకు శిక్షణ ఆపేసి ఆమె దగ్గరే రెండు నెలలున్నా. తర్వాత ఉద్యోగంలో చేరాను కానీ మనసు అంగీకరించక మళ్లీ ప్రిపరేషన్ కొనసాగించా. ఈసారి సొంతంగానే చదివా. రోజంతా చదవడం, రాత్రి పాప దగ్గర ఉండటం... ఇలా చేసేదాన్ని. మొదటి ప్రయత్నంలో 2018లో ఐఆర్‌టీఎస్ రావడంతో చేరిపోయా. తర్వాత ప్రయత్నంలో 633వ ర్యాంకు వచ్చింది. డానిక్స్ (కేంద్రపాలిత ప్రాంతాల సివిల్ సర్వీసెస్)ని ఎంచుకుని చేరా. 2020 కరోనా సమయంలో ప్రిలిమ్స్ దాటలేకపోయా. 2021లో మాత్రం ఎలా అయినా సాధించాలని కష్టపడి చదివా. 56వ ర్యాంకు వచ్చింది. సివిల్స్‌లో ఎంత ఎక్కువ చదివామన్నది కాకుండా ఏం చదివామన్నది ముఖ్యం. అలాగే లక్ష్యం ముందు కష్టం చిన్నగా అనిపించాలి.
ఐఐటీ, ఐఐఎంల్లో చదివినా..
లక్ష్యాన్ని చేరుకున్నట్టే చేరుకోవడం.. తృటిలో తప్పిపోవడం. అయినా నిరాశని దరిచేరనివ్వకుండా.. ఉద్యోగం, లక్ష్యం రెండింటినీ సమన్వయం చేసుకుంటూనే 608వ ర్యాంకుని సాధించింది హైదరాబాద్ అమ్మాయి పవిత్ర ముత్యప్.
నాలుగేళ్ల క్రితం నా సివిల్స్ ప్రయాణం ప్రారంభమయ్యింది. ఇది నా నాలుగో ప్రయత్నం. ఒకసారి ఇంటర్వ్యూ ఆరుమార్కుల తేడాతో పోయింది. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ని ఒకటిన్నర మార్కుల తేడాతో చేజార్చుకున్నా. ఇక వల్ల కాదులే అని నిరాశపడ్డ క్షణాలు ఎదురైనా, సివిల్స్ అనే పదంలోని శక్తే నన్ను విజయంవైపు నడిపించింది. పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. హెచ్‌పీఎస్‌లో చదువుకున్నా. ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశాను. ఐఐఎమ్ బెంగళూరులో ఎంబీయే చదివాను. నాన్న ప్రవీణ్‌కుమార్...హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. అమ్మ అనిత. నాన్నను చూసి నాకూ చిన్నతనం నుంచీ పబ్లిక్ సర్వీసులోకి రావాలని ఉండేది. బీటెక్, ఎంబీయే చేసిన తర్వాతే సివిల్స్‌పై దృష్టి పెట్టాను. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకున్నా. అదయ్యాక ఖాళీగా ఉండటం ఇష్టం లేక క్యాప్ జెమినీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తూ చదువుకున్నా. వారాంతాల్లో పూర్తిగా దృష్టిపెట్టి చదివేదాన్ని. నాకో అక్క. ఆమె డెంటిస్ట్. బావగారు ఐఆర్‌ఎస్. ఆయన సలహా, సూచనలూ తీసుకొనేదాన్ని. మూడుసార్లు విఫలమయ్యాక... ఇంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు. ఇక వదిలేద్దాం అనుకుని నిరాశలోకి వెళ్లా. మళ్లీ.. ఇలాంటి నిరాశ ఎవరికైనా సహజమే. కానీ నా భవిష్యత్‌ని ప్రజల సేవ కోసం వెచ్చించడమే సరైన మార్గం అనిపించి ఆత్మవిశ్వాసం నింపుకొని విజయం సాధించాను.
ఇవీ చదవండి:Civils Results 2021: అమ్మాయిలకు శిరస్సు వంచిన సివిల్స్