రాష్ట్ర కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులను దక్కించుకున్న షాపూర్ జీ పల్లొంజీ సంస్థ పనులను వేగవంతం చేసింది. కూల్చివేతల అనంతరం సచివాలయ ప్రాంగణాన్ని భవన నిర్మాణానికి అనుగుణంగా సిద్ధం చేశారు. నేలను పూర్తి స్థాయిలో చదును చేశారు. ప్రధాన భవన సముదాయం నిర్మించాల్సిన ప్రదేశం సహా నలువైపులా రహదార్ల కోసం మార్కింగ్ పూర్తి చేశారు. అటు సచివాలయ ప్రాంగణంలో భవన నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. తరలింపునకు సాధ్యం కాని చెట్లను అటవీశాఖ అనుమతితో కొట్టేస్తున్నారు.
చెట్లకు పునరుజ్జీవం..
వాడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంషాబాద్ ఆవల మరో చోట తరలించిన చెట్లకు పునరుజ్జీవం ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. భవన నిర్మాణంలో భాగంగా... పిల్లర్ల కోసం తవ్వకాలు చేపట్టారు. మరో పది రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. కాంక్రీట్ తయారీ కోసం ప్రత్యేకంగా బ్యాచింగ్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన యంత్రాలతో పాటు స్టీలు, సిమెంట్ సిద్ధం చేసుకున్నారు. తవ్వకం ప్రక్రియ పూర్తి కాగానే పిల్లర్ల నిర్మాణం పనులను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్పత్తుల ప్రదర్శనలు..
దాదాపు వెయ్యి మంది కార్మికులు సచివాలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. కార్మికులు అక్కడే నివాసం ఉండేలా తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేశారు. రహదార్లు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంజినీర్లు సచివాలయ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు సచివాలయ ప్రాంగణంలో డిస్ ప్లే కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయ నిర్మాణంలో ఉపయోగించే వివిధ వస్తువులకు సంబంధించి ఆయా సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేలా ఈ ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రేపు కేసీఆర్ సమీక్ష