సోయాచిక్కుడు పంట సాగుచేసే రైతులకు సరిపడినన్ని విత్తనాలు అందుబాటులో లేవు. దేశంలో 3.20 లక్షల క్వింటాళ్ల విత్తనాల కొరత ఉందని కేంద్ర వ్యవసాయశాఖ అధ్యయనంలో వెల్లడైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పంట సాగు పెరుగుతున్నందున విత్తనాలకు డిమాండు తీవ్రంగా ఉంది. మొలక శాతం తక్కువగా ఉన్నందున ప్రతి విత్తన ప్యాకెట్‌లో అదనంగా 10 శాతం ఉచితంగా ఇవ్వాలని కేంద్రం విత్తన కంపెనీలకు సూచించింది.
కర్ణాటకలో మొలకలు సరిగా రావడం లేదని ఇప్పటికే పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోనూ ఒకచోట మొలక రాలేదన్న రైతు ఫిర్యాదుతో విచారణకు ఆదేశించినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి 'ఈనాడు'కు చెప్పారు. నాణ్యమైన విత్తనాల కొరత ఉన్నందున ఈసారి కంది లేదా ఇతర పంటలు వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లాల వ్యవసాయాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నాణ్యమైన సోయా విత్తనాల కోసం జాతీయ విత్తన సంస్థను వ్యవసాయశాఖ అడగ్గా ఉన్న విత్తనాల్లో కొన్ని 45 శాతం వరకే మొలక వస్తున్నందున తెలంగాణకు అడిగినన్ని ఇవ్వలేం అని తెలిపిందన్నారు.
సాధారణంగా ఎకరానికి 30 కిలోల విత్తనాలు వాడతారు. ఈ ఏడాది మొలకశాతం తక్కువగా వస్తున్నందున 35 కిలోల దాకా వాడితేనే మేలని రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు, విత్తన శాస్త్రవేత్త డాక్టర్ కేశవులు రైతులకు సూచించారు.
ఇదీ చదవండి: మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!