South Central Railway: రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన వినూత్న విధానాలతో పాటు.. జోన్‌లో సజావుగా నిత్యావసరాల వస్తువుల సరఫరా జరగడానికి కేంద్రీకృత విధానాలను పటిష్ఠంగా అమలు చేయడం వల్ల దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ రంగం రికార్డు స్థాయిలో ఆదాయాన్ని పొందింది. 2020-21 సంవత్సరంలో పార్సిల్ రంగంలో వార్షికాదాయం మొత్తం రూ.108.3 కోట్లు కాగా.. కొవిడ్ -19 మహమ్మారి వల్ల అనేక సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్సిల్స్‌లో 4.78 లక్షల టన్నుల లోడింగ్‌ను నిర్వహించి రూ.200 కోట్ల ఆదాయాన్ని జోన్ సాధించిందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం...
భారతీయ రైల్వే పార్సిల్ స్పేస్ కోసం అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం ఏర్పాటు చేసింది. సమయసారిణి పార్సిల్ రైళ్లు నడపడం వినియోగదారుల స్నేహపూర్వక వివిధ విధానాలు రైల్వేలో అందుబాటులోకి వచ్చాయి. డివిజినల్ స్థాయిలో, జోనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన బిజినెస్ డెవలప్‌మెంట్ యూనిట్లు బృందాల కృషితో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా నూతన పార్సిల్స్‌ను పొందడంతోపాటు రోడ్డు ద్వారా వెళ్లే వస్తువులను రైలు రవాణాకు మళ్లించడం వంటివి పార్సిల్ రంగంలో వృద్ధికి తోడ్పడినట్లు రైల్వే శాఖ తెలిపింది.
పాల రవాణాలో దూద్ దురంతో రైళ్ల పాత్ర..
రైల్వే ప్రవేశ పెట్టిన వినూత్న విధానాలైన కిసాన్ రైళ్లు వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను మంచి మార్కెట్‌తో మెరుగైన ధర పొందేందుకు.. నామమాత్రపు కనీస ఛార్జీతో రవాణా చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. దేశ రాజధాని న్యూ దిల్లీకి పాలను రవాణా చేయడంలో దూద్ దురంతో రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యాపారస్థులు, కార్గో నిర్వాహకులు, రైతులకు ముఖ్యంగా తక్కువ పరిమాణంలో ఉండే వారి ఉత్పత్తులను భద్రంగా, సురక్షితంగా, ఆర్థిక ప్రయోజనంతో, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వేగవంతంగా రవాణా చేసేందుకు ఈ రైళ్లు తోడ్పడుతున్నాయి.
జోన్ పరిధిలో 473 కిసాన్ ప్రత్యేక రైళ్ల ద్వారా 1.57 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసి.. రైల్వే రూ.72.67 కోట్ల ఆదాయాన్ని పొందింది. దూద్ దురంతో రైళ్లతో ఈ ఆర్థిక సంవత్సరంలో 7.22 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేయడం ద్వారా రూ.34.03 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వీటికి అదనంగా, నాన్ లీజ్డ్ట్రాఫిక్ నుంచి రూ.73.62 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పార్సిల్స్ రవాణాలో సాధారణ ప్రయాణికుల రైళ్లు, సమయసారిణి పార్సిల్ ప్రత్యేక రైళ్లూ ఉన్నాయి. 62 ఎస్‌ఎల్‌ఆర్‌లు, 5 సరకు రవాణా వ్యాన్లలో పార్సిల్ స్పేస్ లీజింగ్ ద్వారా రూ.20.08 కోట్ల ఆదాయాన్ని రైల్వేశాఖ సాధించింది.
ఇదీ చదవండి:KTR Tour in America: ఎన్నారైలే రాష్ట్ర రాయబారులు... అమెరికా పర్యటనలో కేటీఆర్