సౌర విద్యుత్‌ను వీలున్నంత ఎక్కువగా వినియోగించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో అమల్లోకి తెస్తోంది. సౌర విద్యుత్‌ను తమ కార్యాలయాల నిర్వహణ కోసం పూర్తిస్థాయిలో వినియోగిస్తోంది. ట్యాంక్‌బండ్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు... బల్దియా జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలు క్రమంగా సోలార్ విద్యుత్ పరిధిలోకి తెస్తున్నారు. ప్రధాన కార్యాలయం మినహా మిగిలిన అన్ని చోట్ల ఇప్పటికే సౌర విద్యుత్ ప్లేట్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నిర్వహణ ఖర్చులు నానాటికీ పెరుగుతండటం వల్ల వాటిని నియంత్రించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. నగరంలో బల్దియాకు చెందిన 34 ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ పేట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయటం వల్ల జీహెచ్‌ఎంసీ సగం విద్యుత్‌ను ఆదా చేస్తోంది.
సగం ఆఫీసుల్లో 100 శాతం...
పునరుత్పాదక శక్తి వినియోగంలో జీహెచ్‌ఎంసీ ఇటీవల మరో మైలురాయి చేరుకుంది. ఇప్పటికే జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో చెత్తను మండించి రోజుకు 19.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అదనంగా బల్దియా కార్యాలయాలపై ఏర్పాటు చేసిన సౌర ఫలకలతో మంచి ఫలితాన్ని పొందుతోంది. ఏడాది క్రితం శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టు పనులు కరోనా ముందు పూర్తయ్యాయి. ఇప్పుడు నగరంలోని సగం కార్యాలయాల్లో 100 శాతం.... మిగిలిన చోట్ల 90 శాతం విద్యుత్ అవసరాలు ఈ సౌర విద్యుత్ తీరుస్తోంది. మొత్తంగా ఏడాదికి రూ.1.5 కోట్ల మేర కరెంటు బిల్లుల వ్యయం ఆదా అవుతున్నట్టు తేల్చారు. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం టీఎస్‌రెడ్కో ఐదేళ్లు పాటు నిర్వహించనుంది. ఒక్కో సౌర పలక సగటున ఏడాదికి 1,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా టీఎస్‌రెడ్కో నిర్వహణ చేయనుంది. ప్రస్తుతం బల్దియా ఉపయోగించుకుంటున్న యూనిట్ విద్యుత్‌కు సుమారు రూ. 9 చెల్లిస్తోంది. సౌరవిద్యుత్ వల్ల ఆ మేర ఖర్చు ఆదా అవుతోంది.
పర్యావరణహితం ఈ ప్రయత్నం..
సహజ వనరులను ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయ విద్యుత్ వినియోగం ఆదా అవుతుంది. దాని ఉత్పత్తికి అయ్యే ఖర్చు... విడుదలయ్యే కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. ఎల్‌ఈడీ ప్రాజెక్టు, వ్యర్థాల నుంచి తయారయ్యే విద్యుత్ ప్రాజెక్టులకు సౌర విద్యుత్ తోడైతే... జీహెచ్‌ఎంసీ పర్యావరణ పరిరక్షణలో చాలా ముందున్నట్లవుతుందని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. 941 మెగావాట్ల సామర్థ్యం గల సౌరఫలకలతో కూడిన ఈ ప్రాజెక్టును మొత్తం రూ. 4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇవ్వనుండగా... ఏటా సుమారుగా 1.4 కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయి.