మూడు నెలల విరామం తర్వాత కూకట్‌పల్లి పారిశ్రామికవాడలోని రక్షణ విడిభాగాల పరిశ్రమ ప్రారంభమైంది. ముడిసరకైన ఇనుము ఆలస్యంగా వస్తోంది. వాటి ధర పది శాతం పెరిగింది. పునఃప్రారంభమైన తర్వాత ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్న పారిశ్రామికవేత్త రామ్.. పెరిగిన ధర రూపంలో భారం పడిందని వాపోతున్నారు.
బాలానగర్‌లోని స్టీలు ఉత్పత్తుల పరిశ్రమ మహారాష్ట్ర నుంచి రావాల్సిన సరకు కోసం వారం రోజులుగా ఎదురుచూస్తోంది. ఉత్పత్తికి అవకాశం లేకపోవడంతో పది మంది కార్మికులు పరిశ్రమకు వచ్చి ఆరా తీసి పోతున్నారని పారిశ్రామికవేత్త శ్రీనివాస్ తెలిపారు. కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ముడిసరకు కొరత గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది. ఉత్పత్తికి, ఉపాధికి విఘాతం ఏర్పడింది. కరోనా కారణంగా మూతపడిన పరిశ్రమలు పునః ప్రారంభమైనా ముడిసరకుల సమస్య వేధిస్తోంది.
ఏది ఎక్కణ్నుంచి రావాలంటే...
ప్లాస్టిక్ ఉత్పత్తులకు అవసరమైన గ్రాన్యూల్స్ తదితరాలు గుజరాత్‌లోని అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్; బెంగాల్‌లోని హల్దియాల నుంచి రావాలి. ప్యాకేజింగు, పీవీసీ, హెచ్‌డీపీ, కాపర్, ఆటోమోబైల్, అల్యూమినియం, స్టీలు మొదలైనవి మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి రావాలి. విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి కూడా కొంత తెలంగాణ పరిశ్రమలకు వచ్చేది. పరిశ్రమలకు అవసరమైన ఆర్డర్లు వాటికి ఇస్తే... ట్రక్కులు, కంటెయినర్లు ఇతర వాహనాల్లో పంపుతారు. గూడ్స్ రైళ్లు, విమానాల కార్గో ద్వారా డీలర్లు వాటిని పరిశ్రమలకు తరలిస్తారు. ఇప్పుడు జాప్యమవుతోంది. హైదరాబాద్‌లో దాదాపు వేయి దుకాణాలు ముడిసరకులను విక్రయిస్తుంటాయి.
చైనా నుంచి ఆగిపోయిన సరఫరా
కరోనా కారణంగా మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ఆశించిన స్థాయిలో రవాణా లేదు. పేరొందిన ఐవోసీ, రిలయన్స్, ఐపీసీఎల్ వంటి పెట్రోరసాయన సంస్థల నుంచి మాత్రమే ప్లాస్టిక్ ముడిసరకుల రవాణా జరుగుతోంది. రాగి, స్టీలు, అల్యూమినియానికి అవసరమైన సరకు ఎక్కువగా రావడం లేదు.
తమిళనాడు, బెంగాల్‌లోని కర్మాగారాల నుంచి రక్షణ శాఖకు సంబంధించి ఐరన్ విడిభాగాలకు అవసరమైన సామగ్రి రవాణాలో జాప్యంతో పాటు ధరలు 10-15 శాతం పెరిగాయి. రాగి, స్టీలు ఉత్పత్తులకు అవసరమైన సరకు ధర కూడా 10 శాతం అధికమైంది. గతంలో చైనా నుంచి ప్లాస్టిక్, స్టీలు ముడిసరకులు వచ్చేవి. ఇప్పుడు అవి నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో భారీ సంఖ్యలో పరిశ్రమలు పూర్తి సమయం నడవడం లేదు. కొన్ని చోట్ల ఒకే పూట నడిపిస్తున్నారు. ఇంకొన్నిచోట్ల.. కార్మికులను రావద్దంటున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ముడిసరకుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. మరోవైపు పరిశ్రమలు పూర్తిస్థాయిలో నడవడం లేదు. ప్రభుత్వమే పరిశ్రమలను ఆదుకోవాలి.
- పి. స్వామిగౌడ్, గాంధీనగర్, ట్రాన్స్‌ఫార్మర్ల పరిశ్రమ యజమాని
డాలర్ ధర పెరిగిందని...
ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆలస్యంగా సరకులు వస్తున్నాయి. మాకు కాగితం అనుబంధ ముడిసరకులు విదేశాల నుంచి వస్తాయి. దిల్లీ, ముంబయిలలోని డీలర్లు దిగుమతి చేసుకొని మాకు పంపుతుంటారు. ఇటీవల డాలర్ ధర పెరిగిందని ధర అయిదుశాతం పెంచారు. - కరణ్‌రెడ్డి, ప్యాకేజింగు పరిశ్రమ, యజమాని, మల్లాపూర్
కొలిక్కి రావడానికి రెణ్నెల్ల సమయం
మాకు స్టెయిన్‌లెస్ స్టీలుకు సంబంధించిన సరకులు జిందాల్ తదితర ప్రముఖ కంపెనీల నుంచి వస్తుంటాయి. ఆయా కంపెనీల్లో ఇప్పుడు ఉత్పత్తి లేదు. డీలర్లు ధరలు పెంచి ఉన్న స్టాక్ పంపిస్తున్నారు. ఒక కొలిక్కి రావడానికి 2 నెలలు పడుతుంది. - చందుకుమార్, ఆటోమొబైల్ పరిశ్రమ యజమాని, పాశమైలారం