Music Director PVR Raja : నేటి యువత కొత్తదారులు వెతుక్కుంటోంది. ఉన్నత చదువులు.. ఆపై ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగాలు అంటూ వెంపర్లాడకుండా తమకు ఇష్టమైన రంగాల్లో ప్రవేశించి ప్రతిభ చాటుతున్నారు. అలా.. గిటార్‌తో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.. ఈ కుర్రాడు. అవకాశాల్ని అందుకుంటూ సుమారు 200 లఘు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
మ్యూజిక్‌లో శిక్షణ
Short Films Music Director PVR Raja : పెనుమత్స వెంకటరామరాజు అలియాస్ పీవీఆర్ రాజా. విజయనగరంలో పుట్టిపెరిగిన ఇతడికి చిన్నప్పటి నుంచి కవితలు రాయడం చాలా ఇష్టం. తన రాతలకు.. తనే మ్యూజిక్ కంపోజ్ చేసుకోవాలనే తపనతో.. షాలమ్స్ మ్యూజిక్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఏలాగైనా సినిమా రంగంలో తన ప్రతిభ చాటాలనే తపనతో.. 2005లో హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే..మరోవైపు సంగీత శిక్షకుడిగా వివిధ అకాడమీల్లో పని చేశాడు.
తొలి లఘుచిత్రం ఆర్య-3
PVR Raja News : 2011లో రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో సొంతంగా రాసి కంపోజ్ చేసిన పాటకు లైట్ మ్యూజిక్ విభాగంలో పురస్కారంకు ఎంపికైంది. అదే ఏడాది రాజస్థాన్ ఉదయపూర్‌లో కేంద్రం నిర్వహించిన జాతీయస్థాయి యువజనోత్స పోటీల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ తరపున ప్రథమ స్థానంలో నిలిచాడు. 2014లో తొలిసారిగా ఆర్య-3 లఘుచిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు.
ఇండస్ట్రీలో నాకు పెద్దదిక్కు వాళ్లే..
'ఇంట్లో నుంచి సపోర్ట్ లేకపోయినా.. హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఆర్పీ పట్నాయక్ బంధువుల వద్ద ఉండేవాడిని. ఇండస్ట్రీలో నాకున్న పెద్ద దిక్కు ఆర్పీ పట్నాయక్, ఎల్బీ శ్రీరామ్. షార్ట్ ఫిలిమ్స్‌లో సినిమా స్థాయిలో సంగీతం ఇవ్వగలమని నిరూపించాను. లఘు చిత్రాల్లో నేను చేసిన సంగీతం.. సినిమాలకు ఏం తీసుకుపోవు.'
- పీవీఆర్ రాజా, యువ సంగీత దర్శకుడు
వెబ్‌సిరీస్‌లకు మ్యూజిక్
PVR Raja Short Films : లఘుచిత్రాలకే కాదు.. వివిధ వెబ్‌సిరీస్‌లకు సంగీతం అందించాడు. "హ్యాపీ ఎండింగ్", "అద్విక", "ఆకాశమంత ప్రేమ", "నా సీతామహాలక్ష్మీ", "హ్యాపీ మారీడ్ లైఫ్ - కన్నడ" తదితర సినిమాలు మంచి పేరు తెచ్చాయి. పలు హిందీ ఇండిపెండెంట్ మూవీలకు స్వరాలు అందించాడు.
9 పురస్కారాలు
Music Composer PVR Raja : ఇప్పటి వరకు.. లఘు చిత్రాల్లో 9 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా పురస్కారాలు వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో "ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డ్స్"లో ఏకంగా 3 ప్రపంచ రికార్డులు సాధించాడు. 10 సెకండ్లలో 36 గిటార్ కార్డ్స్ ప్లే చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఎల్బీ శ్రీరామ్‌తో అనుబంధం
Short Films Music Composer PVR Raja : సంగీత ప్రయాణంలో ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు ఎల్‌బీ శ్రీరామ్‌తో ఏర్పడిన పరిచయం ఓ అనుబంధంగా మారిపోయింది. ఎల్‌బీ శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో నటించిన నిర్మించిన "రూట్స్.. మన మూలాలు", "మా బుజ్జి అక్క వెరీ గ్రేట్","స్వచ్ఛ భారతీయుడు", తదితర సందేశాత్మక చిత్రాలకు సంగీతం అందించాడు.
అక్కడ ఇళయరాజా.. ఇక్కడ పీవీఆర్ రాజా
'పెద్ద చిత్రాలకు ఇళయరాజా.. చిన్న చిత్రాలకు పీవీఆర్ రాజా. అది షార్ట్ ఫిలిమ్స్‌లో అతనికున్న లాంగ్ క్రేజ్. యూత్‌కి క్రేజీ స్టైలిష్ మ్యూజికే కాకుండా.. నేను తీసిన కుటుంబ, సామాజిక విలువలు గల సినిమాలకు కూడా అద్భుతమైన సంగీతమందించాడు. ఈ మధ్య నాతో ఓ చక్కటి పాట పాడించాడు. దాన్ని అతడే చిత్రీకరించాడు.'
- ఎల్బీ శ్రీరామ్, సినీ రచయిత, దర్శకుడు
'మది'తో వెండితెర అరంగేట్రం
ఎంఆర్ ప్రొడక్షన్స్‌లో "ఒక్క క్షణం", "నువ్వు నేను ఈ క్షణం", "ఊపిరిలో ఊపిరిగా" వంటి లఘుచిత్రాలు కట్టిపడేస్తాయి. ప్రస్తుతం.. ప్రగతి పిక్చర్స్ "మది " సినిమాతో సంగీత దర్శకుడిగా తొలిసారిగా వెండితెరకి పరిచయం కాబోతున్నాడు.
మాస్టర్ ఆఫ్ మాస్టర్స్
విజ్ఞానం, సంగీతం, విశ్వం ఇతివృత్తాలు తీసుకుని స్వయంగా రాసి "మాస్టర్ ఆఫ్ మాస్టర్స్" పేరిట ఓ పుస్తకం తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాడు. సంగీత ప్రపంచంలో పీవీఆర్ రాజా వంటి వారు అరుదుగా ఉంటారని తోటి టెక్నిషియన్స్ చెబుతున్నారు.
ఇప్పటికే అనేక అవార్డులు సాధించిన రాజా లఘుచిత్రాల కేటగీరిలో ఆస్కార్ అందుకోవాలి అన్నదే తన లక్ష్యమంటున్నాడు.