గ్రేటర్ హైదరాబాద్లో మురుగు సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించడానికి ఇంకా కొంత సమయం పట్టే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి శుద్ధి లేకుండా నిత్యం 1,060 మిలియన్ లీటర్ల మురుగు మూసీలో కలుస్తోంది. రోజురోజుకూ అనేక ప్రాంతాలకు ఈ సమస్య విస్తరిస్తుండడంతో తొలి విడతలో రోజుకు 376 మిలియన్ లీటర్లు శుద్ధి చేసేందుకు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని 17 ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి గుత్తేదారులకు పనులు కేటాయిస్తూ జలమండలి ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా 65 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలు ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక.
పరిష్కారం కొంతే..
జలమండలి లెక్కల ప్రకారం గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం 1,800 మిలియన్ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం 740 మిలియన్ లీటర్లు మాత్రమే ఎస్టీపీల్లోకి తరలించి శుద్ధి చేస్తున్నారు. మిగతాది మూసీతోపాటు ఇతర చెరువులు, కుంటల్లో కలుస్తోంది. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమవడమే కాకుండా పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
పూర్తిస్థాయిలో ఉంటేనే..
తొలుత నిర్మించే 17 ఎస్టీపీలతో 376 మిలియన్ లీటర్ల మురుగు శుద్ధి చేయనున్నారు. అయినా ఇంకా నిత్యం 684 ఎంఎల్‌డీలు మూసీలోకి చేరనుంది. మొత్తం మురుగును శుద్ధి చేయాలంటే 65 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలు నిర్మించాల్సి ఉన్నా..నిధుల కొరతతో ముందుకు సాగడం లేదు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో గతంలో రూ.400 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టారు. ఈ మురుగు శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు, లేకపోవడంతో సమీపంలోని నాలాల ద్వారా మూసీలోకి చేరుతోంది. దీనిపై జలమండలి అధికారులు మాట్లాడుతూ.. మిగతా ఎస్టీపీల నిర్మాణానికి త్వరలోనే మార్గం సుగమం కానుందని తెలిపారు.
- ఇదీ చదవండి : 40 రూపాయల్లోనే మూడు పూటల ఆహారమా?