రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. సరూర్‌నగర్ చెరువు సమీపంలోని పలు కాలనీలు వరద కాల్వలను తలపిస్తున్నాయి. గడ్డిఅన్నారం డివిజన్లోని కోదండరాంనగర్, సీసలబస్తీ కాలనీలు, లింగోజీగూడ డివిజన్లోని తపోవన్ కాలనీ, సాయినగర్, గ్రీన్ పార్క్ కాలనీలు నీట మునిగాయి. నివాసాల్లో వరద నీరు చేరగా.. స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కాలనీ వాసులు బయటకు వచ్చే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు పొంగిపొర్లుతూ... వాననీరు, డ్రైనేజీ నీళ్లు కలిసి ప్రవహిస్తున్నాయి. అపార్ట్మెంట్లలోని సెల్లార్లు మొత్తం జలమయమయ్యాయి. వాహనాలు నీటి మునిగాయి.
మోకాలు లోతు ప్రవాహం...
సరూర్‌నగర్‌లోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. వీధుల్లో మోకాలు లోతు నీరు ప్రవహిస్తుంది. మ్యాన్ హోల్స్ తెరుచుకుని నీళ్లు పైకి ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఇళ్లలోని వస్తువులు నీట మునిగిపోయాయి. ఇళ్ల చుట్టూ నీళ్లు నిలిచి బయటకు వెళ్లలేక లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ సాయం కోసం చూస్తున్నారు.
ఇళ్లు ఖాళీ చేస్తున్న స్థానికులు...
వీధుల్లో వరద నీరు పోటెత్తుతుడటం వల్ల స్థానికులు నిత్యావసర సరకులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్ష ప్రభావంతో విద్యుత్ అంతరాయం కూడా జనాలను ఇబ్బంది పెడుతోంది. ప్రజలంతా బిల్డింగులపైకి ఎక్కి పాలు, నిత్యవసర వస్తువుల కోసం ఇతరులను ఆశ్రయిస్తున్నారు. రోజువారి పనులు చేసుకోలేని స్థితిలో ప్రజలు కార్యాలయాలకు వెళ్లేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. గత వరదలను దృష్టిలో పెట్టుకున్న నగరవాసులు.. ఆయా ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. గతంలో వరదలు వచ్చిన సందర్భంలోనూ... కాలనీవాసులు ఇవే పరిస్థితులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇక్కడి ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.