రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు(Saddula Bathukamma 2021) అంబరాన్నంటాయి. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా.. చౌరస్తాలన్ని బతుకమ్మలతో మురిసిపోయాయి. తీరొక్క పూలతో తీరుగా పేర్చిన బతుకమ్మలన్ని నేలతల్లిని సింగారించాయా అన్నట్టు.. మైమరిపించాయి. రంగురంగుల పట్టుచీరలు, పట్టుపరికిణీలు.. ఒళ్లంతా నగలతో ఆడబిడ్డలంతా సింగారించుకుని ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. రహదారులన్ని కోలాహలంగా మారాయి. ఉయ్యాల పాటలు.. గాజుల చేతుల చప్పట్లతో వీధులన్ని మారుమోగిపోయాయి.
![SADDULA BATHUKAMMA CELEBRATIONS 2021 IN TELANGANA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13357844_ee4.png)
పాటలతో పరవశించిన గ్రామాలు..
రాష్ట్రంలో నిన్న చాలా చోట్ల సద్దుల బతుకమ్మ జరుపుకోగా.. ఈరోజు మిగిలిన అన్ని ప్రాంతాల్లో సంబురాలు ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా పెద్దసంఖ్యలో వేడుకల్లో హాజరయ్యారు. మహిళలంతా ఉత్సాహంగా.. ఉయ్యాల పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడారు. రకరకాలు పాటలతో.. వివిధ రూపాల నృత్యాలతో.. ఊళ్లన్ని ఉత్సాహంతో ఊగిపోయాయి. కొన్ని చోట్ల డీజేల్లో బతుకమ్మ పాటలు పెట్టి.. కోలాటాలతో యువతులు హోరెత్తించారు. చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకు.. అందరూ బతుకమ్మ ఆటల్లో కాలు కదిపారు. రకరకాల నృత్య రీతులతో.. ఆనందంగా పండుగను ఆస్వాదించారు.
![SADDULA BATHUKAMMA CELEBRATIONS 2021 IN TELANGANA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13357844_svsvc.jpg)
రవీంద్రభారతిలో సంబురాలు..
హైదరాబాద్ రవీంద్రభారతిలో బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. సద్దుల బతుకమ్మ పురస్కరించుకొని ఐటీ ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగినులు వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు.
అంబర్‌పేట వేడుకల్లో కిషన్‌రెడ్డి..
హైదరాబాద్ భాజపా సెంట్రల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కరోనా తగ్గితే కేంద్ర ప్రభుత్వం తరపున దిల్లీలో బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. బతుకమ్మ పండుగను ప్రపంచం మొత్తం తెలిసేలా జరుపుతామని స్పష్టం చేశారు.
హరీశ్‌రావు నివాసంలో సద్దుల సందడి..
![SADDULA BATHUKAMMA CELEBRATIONS 2021 IN TELANGANA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13357844_gevge.png)
సిద్దిపేటలోని మంత్రి హరీశ్‌రావు నివాసంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. మంత్రి హరీశ్‌రావు సతీమణి శ్రీనిత, కూతురు వైష్ణవి.. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. డీజే ఏర్పాటు చేసి.. బతుకమ్మ పాటలతో మహిళల్లో ఉత్సాహం నింపారు. ఆడపడుచుల ఆటపాటలతో మంత్రి నివాసంలో సందడి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీ కవిత తోటి మహిళలతో బతుకమ్మ ఆడారు.
![SADDULA BATHUKAMMA CELEBRATIONS 2021 IN TELANGANA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13357844_evedv.png)
ఓరుగల్లులో జనసంద్రం..
ఓరుగల్లులో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఆకాశన్నంటాయి. బతుకమ్మలతో మహిళలు... ఆలయాల బాట పట్టారు. కనుచూపుమేర వనితలతో.. హనుమకొండ పద్మాక్షి గుండం పరిసరాలు కిటకిటలాడాయి. జనసంద్రాన్ని తలపించిన పరిసరాలు.. బతుకమ్మ ఆటపాటలతో మారుమోగిపోయాయి. యువతులు.. రకరకాల నృత్యరీతులు ప్రదర్శిస్తూ.. బతుకమ్మ పండుగను ఆస్వాదించారు.
![SADDULA BATHUKAMMA CELEBRATIONS 2021 IN TELANGANA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13357844_pppcf.png)
చెరువులకు చేరిన పూల సింగిడి..
తనివితీరా ఆటలు ఆడుకున్న మహిళలు.. అనంతరం బతుకమ్మను సాగనంపేందుకు చెరువులకు చేరుకున్నారు. బతుకమ్మలు నిమజ్జనం చేసేందుకు ఆయా చెరువుల దగ్గర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. "పోయిరా బతుకమ్మ.. పోయి మళ్లీ రా బతుకమ్మ.." అంటూ.. సాగనంపారు. చెరువులు మొత్తం బతుకమ్మలతో మెరిసిపోయింది. ఆ తర్వాత.. చెరువు కట్టలపైన మహిళలంతా కూడి.. బతుకమ్మకు నైవేద్యంగా పెట్టిన రకరకాల ప్రసాదాలను ఒకరికొకరు పంచుకున్నారు. పసుపుబొట్లు పెట్టుకుంటూ.. సందడి చేశారు. ఇళ్లకు తిరిగొచ్చిన అనంతరం.. కోలాటాలు, దాండియాలు ఆడుకుంటూ పండుగను ఎంజాయ్ చేశారు.
![SADDULA BATHUKAMMA CELEBRATIONS 2021 IN TELANGANA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13357844_ev.png)
ఇదీ చూడండి: