ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను సాధించుకోవడానికి చేపట్టిన సమ్మె ఉద్రిక్తంగా మారుతోంది. ఓపక్క ఆర్టీసీ జేఏసీ.. మరో పక్క ప్రభుత్వం పోటాపోటీగా పట్టు వీడకపోవడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వస్తామని ఐకాస నేతలు ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు.
ఆర్టీసీ ఐకాస నేతలతో చర్చలు ముగిసిన అధ్యాయం..
"ఈ చర్యలన్నీ చేపట్టడానికి ప్రధాన కారణం ఆర్టీసీ యూనియన్ల అతిప్రవర్తనే. ఏ ప్రభుత్వం ఉన్నా వీళ్ల అతిప్రవర్తనలో మార్పు లేదు. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ యాజమాన్యానికి ఇవ్వడం లేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయం. ఎవరూ డిస్మిస్ చేయకుండా వాళ్లంతట వాళ్లే తొలగిపోయారు. గడువులోగా విధుల్లో చేరకపోవడంతో వాళ్లు ‘సెల్ఫ్ డిస్మిస్’ అయినట్లే"
- గత సమావేశంలో సీఎం కేసీఆర్
కరీంనగర్‌లో కేసీఆర్ ఇంటి ముట్టడి
కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడించారు. తీగలగుట్టపల్లిలోని సీఎం ఇంటి ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రవాణాశాఖ మంత్రి కార్యలయం ఎదుట నిరసన
ఖమ్మంలో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఐకాస పిలుపు మేరకు బైకు ర్యాలీకి సిద్ధమయ్యేందుకు ఖమ్మం బస్‌డిపోవద్ద కార్మికులు గుమిగూడారు. అనంతరం ఒక్కసారిగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ క్యాంపు కార్యాలయం వైపు ర్యాలీ చేపట్టారు. తొలుత కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆ తర్వాత కొంతమంది కార్మికులు క్యాంపు కార్యాలయం గేట్లు దూకి లోపలికి దూసుకెళ్లారు. మిగతావారు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఓరుగల్లులో కార్మికుల ధర్నా
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. వరంగల్-1 డిపో ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. బస్సులు బయటకు పోకుండా డిపో ఎదుట బైఠాయించి ఆందోళనలు చేశారు. ఐకాస నేతలను చర్చలకు పిలిపించి, ప్రజారవాణాను కాపాడాలని డిమాండ్ చేశారు.
బతుకుబండి నడిపేదెలా..?
బతుకుబండి నడిపేందుకు కార్మికులు అవస్తలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా డిపోలోని కండక్టర్లు, కండక్టర్లు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతూనే తాత్కాలికంగా ఇతర పనులు, కులవృత్తులు చేసుకుంటున్నారు. ఇళ్లు గడవడం కష్టంగా ఉందని కార్మికుల కుటుంబీకులు చెబుతున్నారు.
ఆర్టీసీ కార్మికుల్ని ఏం చేయాలనుకుంటున్నారు..?
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. సీఎం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని నరేశ్ అనే కార్మికుడు లేఖలో పేర్కొన్నా.. పోలీసులు ఎందుకు కేసీఆర్‌పై కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారికి భాజపా అండగా ఉంటుందని ఆయన ధైర్యం చెప్పారు.
బస్ రోకోకు అనుమతి లేదు: సీపీ
ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఐకాస ఇచ్చిన బస్ రోకోకు అనుమతి లేదని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ప్రతి బస్ డిపో, బస్ భవన్ వద్ద 500 మీటర్ల వదరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. కార్మికులు గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని సీపీ హెచ్చరించారు.