RMC COMMITTEE MEETING: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆర్ఎంసీ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న కమిటీ ఐదో సమావేశం ఈ నెల 27వ తేదీన జరగాల్సి ఉంది. అయితే మరుసటి రోజు నుంచి కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణ జరగనుండటంతో మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. ఈ 27న జరిగే సమావేశంపై రెండు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లు దృష్టి సారించడంతో ఆర్ఎంసీ సమావేశాన్ని నిలుపుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
ట్రైబ్యునల్ విచారణ నేపథ్యంలో 27న జరగాల్సిన ఆర్ఎంసీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కోరారు. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యుడు, ఆర్ఎంసీ కన్వీనర్‌కు ఆయన లేఖ రాశారు. అటు మైలవరం బ్రాంచ్ కాల్వకు వెంటనే మరమ్మత్తులు పూర్తి చేసేలా చూడాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు.
నాగార్జునసాగర్ చివరి ఆయకట్టులో ఉన్న ఏపీ పొలాలకు సాగు నీరు అందాలంటే ఖమ్మం సీఈ పరిధిలోని మైలవరం బ్రాంచ్ కెనాల్ కు మరమ్మత్తులు చేసి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. లేదంటే ఏపీకి చెందిన చివరి ఆయకట్టుపై ప్రభావం బాగా ఉంటుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో మైలవరం బ్రాంచ్ కెనాల్ మరమ్మత్తు పనులు త్వరగా పూర్తయ్యేలా ఖమ్మం చీఫ్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లాలని కృష్ణా బోర్డును ఏపీ ఈఎన్సీ కోరారు.
ఇవి చదవండి: