రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దుండగుడి దాడిలో సజీవ దహనమైన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి భౌతికకాయానికి కొత్తపేటలో ఆయన నివాళులర్పించారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ప్రోద్బలం వల్లే విజయారెడ్డిపై దాడి జరిగిందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయారెడ్డి మృతదేహానికి నివాళులర్పించేందుకు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రాకపోవడం చాలా బాధాకరమన్నారు.
విజయారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్రంగా పరిగణించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. రెవెన్యూ సంఘాలు ఈఘటనపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతిస్తుందని ఆయన ప్రకటించారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?