Republic day celebrations in Telangana: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని యుద్ధవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం రాజ్ భవన్‌లో జాతీయ పతాకం ఆవిష్కరించారు. వేడుకల్లో సీఎస్ సోమేశ్ కుమార్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్... తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు.
ఐటీ, మెడికల్, ఫార్మా హబ్‌గా...
ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని రూపొందించి భారత దేశానికి అందించిన దార్శనికులకు ఈ శుభప్రదమైన రోజున వందనం చేస్తున్నాను. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఐటీ, మెడికల్, ఫార్మా హబ్‌గా హైదరాబాద్ రూపుదిద్దుకోవటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో కార్పొరేట్ సంస్థలు నెలకొల్పడానికి అనువుగా మారింది. ఇటీవల కాలంలో తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగింది. కరోనా కష్టకాలంలోనూ కోట్లాది మందికి ఆహార భద్రత అందించేందుకు శక్తికి మించి పంటలు పండించిన రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. - తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ప్రగతిభవన్‌లో జెండా వందనం
హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సహా డీజీపీ మహేందర్ రెడ్డి , అధికారులు పాల్గొన్నారు. అంతకముందు సికింద్రాబాద్‌లో సైనికవీరుల స్మారకం వద్ద యుద్ధవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అసెంబ్లీ ఆవరణలో ఘనంగా గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. జెండా ఆవిష్కరణలో ఉపసభాపతి పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. శాసనమండలి వద్ద ప్రొటెం ఛైర్మన్ జెండా వందనం చేశారు.
హైకోర్టులో అట్టహాసంగా వేడుకలు
హైకోర్టులో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ జాతీయ గీతం ఆలపించి జెండా వందనం చేశారు. బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్... సచివాలయ అధికారులు, సిబ్బందితో కలిసి జెండా ఆవిష్కరించారు. టీఎస్‌పీఎస్‌స్సీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఛైర్మన్ జనార్దన్ పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జెండా ఎగురవేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేశ్ కుమార్ జెండా వందనం చేశారు. జెండా ఆవిష్కరణ వేడుకల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా అధికారులు పాల్గొన్నారు. రవీంద్రభారతిలోని తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు గౌరీ శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇదీ చదవండి : 'పక్కా ప్రణాళికతోనే దాడి.. నా ప్రాణాలకు రక్షణ లేదు..'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!