హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా నేతలు పాల్గొన్నారు.
అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలనే దిశగా ప్రధాని మోదీ ప్రభుత్వం పని చేస్తోందని బండి సంజయ్ అన్నారు. 'సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్' అనే నినాదంతో కేంద్ర సర్కారు ముందుకెళ్తోందని తెలిపారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ పాలన ఉందని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ అవినీతి పాలన నడుస్తోందని ఆరోపించారు.
అంబేడ్కర్ ఆశయాలను ఇప్పటికీ సాధించలేకపోయామని... మోదీ నాయకత్వంలో వారి ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం పని చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.ఈ దేశంలో కుటుంబ, కుల, అవినీతి రాజకీయాలు విలయతాండవం చేస్తున్నాయని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేదే మోదీ నాయకత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యాలను, అబద్ధాలను తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీకయే.. స్వదేశీ టీకా : గవర్నర్