Registrations Department Record Level Income : తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. మార్చి నెలలో ఏకంగా రూ.1501 కోట్లు రాబడి సమకూర్చి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఆర్థిక ఏడాదిలో అత్యధికంగా 19.87లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి రూ.12,364 కోట్ల ఆదాయాన్ని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వ ఖజానాకు సమకూర్చింది.
ఇదే తొలిసారి : ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన రాబడుల కంటే ఇదే అత్యధికం కావడం విశేషం. కొవిడ్ కారణంగా రిజిస్ట్రేషన్లు స్తంభించి రెండేళ్లపాటు ఆదాయం భారీగా తగ్గినప్పటికీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం త్వరితగతిన పుంజుకుంది. సగటున నెలకు వెయ్యి కోట్లుకుపైగా ఆదాయం వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పదివేల కోట్లు దాటిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు.
Record Level Income by Registrations : ఈ ఆర్థిక ఏడాది మే నెలలో ధరణి వెబ్‌సైట్ అప్‌డేషన్, కొవిడ్, ఇతరత్ర కారణాలతో దాదాపు యాభై రోజులు రిజిస్ట్రేషన్లు జరగలేదు. అయినా రూ.12,364.59 కోట్లు ఆదాయాన్ని తెచ్చి పెట్టి ఈ శాఖ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. గడిచిన నాలుగేళ్లుగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే 2018-19లో 15.2లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.6,612.74 కోట్లు ఆదాయం వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 16.59లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడం ద్వారా రూ. 7,061.02 కోట్ల ఆదాయం సమకూరింది.
వేయికోట్లకు పైగా ఆదాయం : 2020-21లో 12.11లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు కావడం ద్వారా రూ.5,260 కోట్లు ఆదాయం లభించింది. కొవిడ్ కారణంగా రిజిస్ట్రేషన్లు స్తంభించడంతో ఇక్కడ ఆదాయం భారీగా పడిపోయింది. అయినా 2021-22 ఆర్థిక ఏడాదిలో ఏకంగా 19.87 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రికార్డు స్థాయిలో రూ.12,364.59 కోట్లు రాబడి వచ్చింది. ఈ రాబడి ఆల్ టైం రికార్డుగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా నెలకు అయిదారు వందల కోట్లకు మించి రాబడి రాదు. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అందుకు భిన్నంగా సగటున నెలకు వెయ్యి కోట్లకుపైగా ఆదాయం వచ్చింది.
- ఇదీ చదవండి : తెరాసలో పెరుగుతున్న రాజ్యసభ ఆశావహులు