ప్రభుత్వ సహాయం అందని పేదలకు పార్టీ తరఫున ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఆయా జిల్లాల పార్టీ నాయకులు జిల్లాల నుంచి ప్రజాభిప్రాయాలు సేకరించి, వాటిని ఈ నెల 22వ తేదీన కలెక్టర్లకు అందచేయాలని సూచించారు. నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్‌లు, ముఖ్య నాయకులతో కుంతియా, ఉత్తమ్ వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు.
అన్నదాతలకు అండగా..
పంటల సేకరణ విషయంలో అన్నదాతలకు అండగా నిలవాలని పార్టీ నాయకులు టీపీసీసీ పిలుపునిచ్చింది. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించింది. ఏదైనా సమస్య ఉంటే ఆ వినతి పత్రాల కాపీలను గాంధీభవన్ పంపిస్తే... సమాచారాన్ని బట్టి డీజీపీ, సీఎస్, గవర్నర్లకు అందజేస్తామన్నారు. తెల్లరేషన్ కార్డులు లేని పేదలకు, వలస కార్మికులకు ప్రభుత్వం నుంచి సహయం అందేలా చూడాలని హస్తం పార్టీ శ్రేణులకు అధిష్ఠానం సూచించింది. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యతలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో..
ప్రభుత్వ సహాయ కార్యక్రమాలలో తెరాస నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ కార్యక్రమాలుగా చేస్తున్నందున.. కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని... వారిని ఆదుకోడానికి కేంద్ర విదేశాంగ మంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: ప్రభుత్వమిచ్చే రేషన్‌లో కేంద్రం వాటా ఎంత: ఉత్తమ్