రేషన్ బియ్యానికి బదులు నగదు పంపిణీపై కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో కిలో బియ్యం రూ.35 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. ఇంకా పెరిగితే వాటిని కొనగలమా? తినగలమా? అని ప్రశ్నిస్తున్నారు. కార్డులపై వచ్చే బియ్యానికి.. సన్నబియ్యం కలిపి తింటున్నామని వివరిస్తున్నారు. ప్రభుత్వమే తినగలిగే బియ్యాన్ని ఇస్తే.. సమస్య ఏముంటుందనే అభిప్రాయం కార్డుదారుల్లో వ్యక్తమవుతోంది. బియ్యానికి బదులుగా నగదుపై ఏపీవ్యాప్తంగా 26 జిల్లాల్లో ‘ఈనాడు-ఈటీవీభారత్’ ప్రతినిధులు కార్డుదారులతో మాట్లాడారు. నూటికి నూరుశాతం మంది తమకు బియ్యమే కావాలని, నగదు తీసుకోబోమని తేల్చి చెప్పారు. నగదు బదిలీ ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, బియ్యం కొనుక్కోలేని పేద కుటుంబాల పరిస్థితి చూడాలన్నారు.
బియ్యానికి నగదు ఇస్తే.. పేదలపై మరింత భారం పడుతుందని, ఇంటి ఖర్చు పెరుగుతుందని పలువురు కార్డుదారులు వివరించారు. బియ్యంతో లభించే ఆహార భరోసా నగదుతో వస్తుందా? అని కొందరు ప్రశ్నించారు. ‘బియ్యం అయితే ఇంటికే వస్తాయి. నగదు ఇస్తే బియ్యం కొనేలోపే ఇతరత్రా ఖర్చయిపోతుంది’ అని పి.గన్నవరం మండలానికి చెందిన చిట్టాల శివాజీనాయుడు పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో.. రేషన్ దుకాణాల ద్వారా మిగిలిన వాటిని కూడా రాయితీపై అందించాలని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దేశవానిపేటకు చెందిన బి.తిరుపతిరావు కోరారు.
బియ్యం నాణ్యత మరింత మెరుగుపడితేనే..
ప్రస్తుతం ఇస్తున్న బియ్యం బాగానే ఉన్నా.. మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని కొందరు కార్డుదారులు చెప్పారు. రేషన్‌కార్డుపై వచ్చే బియ్యాన్నే తాము వాడుతున్నామని, అవి అయిపోయాకే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నామని గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన పార్వతి పేర్కొన్నారు. ‘ప్రస్తుతం సరఫరా చేసే బియ్యం కంటే.. నాణ్యమైన వాటిని సరఫరా చేస్తే వాటినే తింటాం.. ఎవరూ బయటకు అమ్మే పరిస్థితి ఉండదు’ అని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన మొదలవలస జయ అభిప్రాయపడ్డారు. ‘డబ్బులు వద్దు, బియ్యమే కావాలి. కుటుంబసభ్యులమంతా పనులు చేసుకుని జీవించే వాళ్లమే’ అని బాపట్ల జిల్లా అద్దంకి శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన బొజ్జా వెంకాయమ్మ వాపోయారు. ‘కాఫీ హోటల్ నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న మా కుటుంబానికి ఈ రేషన్ బియ్యమే దిక్కు. ఇప్పుడు ఇచ్చే రకం కాకుండా కాస్త సన్న బియ్యం అందిస్తే నగదు బదిలీకి వెళ్లాల్సిన పని ఏముంటుంది?’అని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలేనికి చెందిన బి.హరిబాబు ప్రశ్నించారు.
పింఛన్లూ పోతాయేమో
ఇచ్చే బియ్యం బాగున్నా, బాగా లేకున్నా.. వాటినే తినడానికో, టిఫిన్ కోసమో ఉపయోగించుకుంటున్నామని పలువురు కార్డుదారులు వివరించారు. నగదు బదిలీకి అంగీకరిస్తే భవిష్యత్తులో కార్డు తీసేస్తారనే భయం ఉందని అనకాపల్లి జిల్లా రాయవరానికి చెందిన ఎం.నారాయణరావు చెప్పారు. ఒకసారి నగదు బదిలీకి అంగీకరిస్తే.. తర్వాత కార్డు తొలగిస్తారనే భయాలు ఉన్నాయని తిరుపతికి చెందిన సుశీల, నిర్మలకుమారి, అనకాపల్లి కొండపల్లివారి వీధికి చెందిన కుమారి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్నే నెలలో పది రోజుల వరకు వండుకుని తింటుంటామని బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని మహిళ ఊటుకూరు శ్రావణి తెలిపారు. నగదు బదిలీతో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగే ప్రమాదం ఉందని వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఎం.రవిప్రసాద్, చెన్నమ్మ, విజయనగరం జిల్లా గురానపేటకు చెందిన ఎస్.ఎల్లంనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించాలని ఇదే జిల్లా ఎల్.కోటకు చెందిన శశి, బలిజపేటకు చెందిన గౌరిశెట్టి కోరారు.‘బియ్యం ఉంటే ఓ పూట పనిలేకపోయినా తిండికి ఇబ్బంది ఉండదు. డబ్బులిస్తే ఖర్చయిపోతాయి. ఇదేదో రేషన్ కార్డులు తొలగించే కుట్రగా ఉంది..’ అని అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం వేంపల్లె వాసి రెడ్డెప్ప పేర్కొన్నారు.
బియ్యమే కావాలని చెప్పేశాం
'మా కుటుంబ సభ్యులమంతా ప్రతి నెలా రేషన్ బియ్యం విడిపించుకుంటాం. బియ్యం నాణ్యత సరిగా లేకున్నప్పటికీ తీసుకున్న వాటిని ఇతర కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటాం. ఇప్పుడు డబ్బులు కావాలా అని సిబ్బంది అడుగుతుంటే బియ్యమే కావాలని ఖరాకండిగా చెప్పేశాం.' - కె.ఈశ్వరమ్మ, కొత్తగాజువాక, విశాఖపట్నం జిల్లా
నాణ్యమైన బియ్యం ఇస్తే ఇబ్బందేముంది?
'బియ్యానికి బదులు డబ్బులు తీసుకుంటారా అని సచివాలయ సిబ్బంది వచ్చి అడుగుతున్నారు. డబ్బులు తీసుకుంటే కార్డులు రద్దు చేస్తారన్న ఆందోళన మాలో ఉంది. మా కుటుంబానికి బియ్యమే కావాలని చెప్పాం. నాణ్యమైన బియ్యం ఇస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రభుత్వం ఆలోచించడం లేదు.' - మదీనా ఆలి, అజీమాబాద్, విశాఖపట్నం జిల్లా
బియ్యం నాణ్యత పెరగాలి
'ప్రతి నెల చౌక బియ్యం కార్డు ద్వారా తీసుకుంటున్నాం. ఒక్కొక్కసారి లావు బియ్యం ఇస్తున్నా ఎప్పుడూ వద్దనలేదు. వాటికి కొద్దిగా బీపీటీ రకం బియ్యం కలిపి వండుకుంటున్నాం. ప్రభుత్వం నగదు ఇస్తామన్నా తీసుకోను. అన్నం వండుకోవడానికి, అట్లు పోసుకోవడానికి వీటిని వినియోగిస్తున్నాం. బియ్యం నాణ్యత ఇంకాస్త మెరుగుపడాలి. సన్నబియ్యం ఇస్తే బాగుంటుంది.' -షేక్ ఫైరోజ్‌మాలిక్, 23వ వార్డు, వినుకొండ, పల్నాడు జిల్లా
రెండు నెలలుగా కందిపప్పు అందడం లేదు
'నలుగురు సభ్యులున్న కార్డులకు ఇరవై కిలోల బియ్యం వస్తున్నాయి. కొంత అన్నానికి ఉపయోగించినా..టిఫిన్లలోకి సరిపోతున్నాయి. నగదు బదిలీ ఆలోచనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. గతంలో బియ్యం, పంచదార, కందిపప్పుతో పాటు మరికొన్ని సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు కందిపప్పు రెండు నెలలుగా అందడం లేదు.' - వై.రమణ, బాలాజీనగర్, గుంటూరు
బియ్యం కార్డులు రద్దు చేస్తారని భయమేస్తోంది
'బియ్యం కార్డుకు నగదు బదిలీ పథకం అమలు చేస్తే రాబోయే కాలంలో బియ్యం కార్డులు తొలగిస్తారనే భయం ఉంది. మా కుటుంబంలో ఐదుగురం ఉన్నాం. కుటుంబమంతా రేషన్ బియ్యమే తింటాం. మాకు బియ్యమే కావాలి.' -షేక్ సైదాబీ , మునగచర్ల, నందిగామ మండలం, ఎన్టీఆర్ విజయవాడ జిల్లా
ఇంటి ఖర్చులే భరించలేకున్నాం..
'కూలి చేస్తే వచ్చే డబ్బులు ఇంటాయన మందుల ఖర్చుకు సరిపోతోంది. కుమార్తె చదువు కూడా మాన్పించి కూలికి తీసుకెళ్తున్నా. నిత్యావసరధరలు పెరగడంతో.. వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోవడం లేదు. బయట మార్కెట్లో బియ్యం కొనాలంటే రూ.40 వరకు ఉంది. నగదు తీసుకుంటే.. ఖర్చులు మరింత పెరుగుతాయి. మా వల్ల ఎక్కడవుతుంది?' -జూపల్లి రమణ, ఆకులగణపవరం, పల్నాడు జిల్లా
నగదుతో బియ్యమే కొంటారని చెప్పలేం
'కార్డుదారుల ఖాతాలో నగదు వేస్తే.. వాటితో బియ్యమే కొంటారని చెప్పలేం. ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చు. నాసిరకం బియ్యం ఇవ్వడం వల్లే కొందరు వినియోగించడం లేదు. సన్న బియ్యం ఇస్తామని గతంలో చెప్పిన నేతలు నూక శాతం తగ్గించి అందిస్తున్నారు.' -నీసు జ్యోతి, గృహిణి, పాటిబండ్ల, పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా
ఇవీ చదవండి :