కరోనా గండం నుంచి గట్టెక్కిన పది పరీక్షలకు మరో గండం వాన రూపంలో ముంచుకొస్తోంది. జూన్ 8 నుంచి జరగనున్న ఈ పరీక్షలకు వర్షాకాలం కష్టం తెచ్చిపెట్టేలా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణ రెడ్డి అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆరా తీశారు.
విద్యుత్తు సరఫరా ఉందా? ప్రతి గదిలో ట్యూబ్‌లైట్లు ఉన్నాయా? అవి పనిచేస్తున్నాయా? ఒకవేళ ఒకటే లైట్ ఉంటే చీకట్లు కమ్ముకున్నా కాంతి సరిపోతుందా? లేనిపక్షంలో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షల కోసం ఎంపిక చేసిన గదుల్లో ఒకవేళ ఫ్యాన్లు ఉన్నా ట్యూబ్‌లైట్లు లేని, వెలిగినా సరైన కాంతి ఇవ్వని పరిస్థితి 10-15 శాతం గదుల్లో ఉండొచ్చని ప్రధానోపాధ్యాయులు అంచనా వేస్తున్నారు.
గతంలో 2530 పరీక్ష కేంద్రాలు ఉండగా కరోనా కారణంగా భౌతిక దూరం నిబంధన వల్ల మరో 2,005 సెంటర్లను పెంచారు. పాత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న గదులతో పాటు ప్రాథమిక పాఠశాల భవనాలను కొత్త కేంద్రాల కోసం ఎంచుకున్నారు. వాటిల్లో ఫర్నిచర్ లేకపోతే సమకూర్చుకోవాలని నిర్ణయించారు. అకస్మాత్తుగా వర్షం వస్తే చీకటి కమ్ముకుంటుంది కాబట్టి గదుల్లో కాంతి ముఖ్యమని అధికారులు భావిస్తున్నారు.
గతంలో ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించిన డీఎస్సీ సమయంలో వర్షం వల్ల పలుచోట్ల సమస్యలు వచ్చాయని, ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి చెప్పారు.