మరోసారి టీవీల్లో కనిపిస్తే అంతం చేస్తామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (వైకాపా) తనను బెదిరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (వైకాపా) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి లేఖలు రాశారు.
‘మంగళవారం ఉదయం 11.50 గంటల సమయంలో లోక్‌సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉన్న నా దగ్గరకు వచ్చిన ఎంపీ మాధవ్ అసభ్య పదజాలంతో దూషించారు. మరోసారి టీవీల్లో కనిపిస్తే అంతం చేస్తామని బెదిరించారు. నా దగ్గరకు రావడానికి ముందు ఆయన మా పార్టీ ఎంపీల దగ్గర కూర్చున్నారు. బహుశా వాళ్లు రెచ్చగొట్టడంతోనే అలా చేసి ఉంటారు. పార్లమెంటు సెంట్రల్ హాలులోని సీసీ టీవీలను పరిశీలిస్తే నన్ను బెదిరించే దృశ్యాలు కనిపిస్తాయి. సభా నాయకుడిగా ఉన్న మీ (ప్రధానమంత్రి) దృష్టికి వాస్తవాలను తీసుకొస్తున్నా. ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని రఘురామ కోరారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితుడైన మాధవ్ బెదిరించారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాణ హాని ఉన్నందున రక్షణ కల్పించాలని ప్రధానికి రఘురామ విజ్ఞప్తి చేశారు. ఆలస్యం చేయకుండా మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని సభాపతికి రాసిన లేఖలో కోరారు.
ఉపాధి నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేయించండి
కేంద్రం విడుదల చేసిన ఉపాధి నిధులను ఇతర పథకాలకు మళ్లించారని ప్రజలు అభిప్రాయపడుతున్నందున వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ జరిపించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. ‘2018-19లో కేంద్రం నిధులు విడుదల చేసినా రాజకీయ కారణాలతో విజిలెన్సు విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులను నిలిపేసింది. మొత్తం రూ.1800 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఏపీ హైకోర్టు జోక్యంతో గత వారం కేవలం రూ.28 కోట్లే చెల్లించింది. ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన నిధులను రాబట్టి నేరుగా కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలి’ అని రఘురామ కోరారు.