Modi Visits Hyderabad : హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్-ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకలకు ప్రధానమంత్రి మోదీ హాజరవుతున్నారని పీఎంవో ప్రకటించింది. గ్రాడ్యుయేట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ప్రపంచంలోని అగ్రగామి బిజినెస్ స్కూల్స్‌లో.... హైదరాబాద్ ఐఎస్‌బీ ఒకటిగా నిలిచింది. ఎంతోమంది మెరికలను తయారు చేసింది.
Modi Hyderabad Visit : గురువారం జరగనున్న ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొని.... విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఐఎస్‌బీ మైస్టాంప్, ప్రత్యేక కవర్‌ను విడుదల చేస్తారు. సుమారు 900 మంది విద్యార్థులు స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు ప్రధాని మోదీ పతకాలను అందజేస్తారు.
PM Modi Hyderabad Tour : హైదరాబాద్‌లో రేపటి ప్రధాని పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని పీఎంవో.... రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేకంగా అందించినట్లు తెలిసింది. 3 నెలల్లో మోదీ హైదరాబాద్‌కు రెండోసారి రానున్నారు. ప్రధాని గత పర్యటనకు దూరంగా ఉండాలని సీఎంకు పీఎంవో చెప్పిందని... అందుకే ప్రోటోకాల్ కోసం కేసీఆర్ రాలేదని.... కొందరు మంత్రులు ఆరోపించారు. ఈ ఆరోపణలను కేంద్రమంత్రులు తిప్పికొట్టారు.
ఈ నేపథ్యంలో మరోసారి ఎలాంటి వివాదం రాకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి కార్యాలయం.. ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చిందని కేంద్ర వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన దృష్ట్యా..... ప్రధానికి స్వాగతం పలకబోరని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్ ప్రకారం సీఎస్ సోమేశ్‌కుమార్.... స్వాగతం పలుకుతారని తెలుస్తోంది. అటు.. భాజపా నేతలు ప్రధానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
ప్రధాని మోదీ పర్యటన కోసం పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్‌బీతోపాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్‌సీయూలో బలగాలను మోహరిస్తున్నారు. ఒక్క ఐఎస్‌బీలోనే సుమారు 2 వేల మందితో బందోబస్తు చేపడుతున్నారు. ఐఎస్‌బీ పరిసరాల్లో డ్రోన్లు ఎగరకుండా చర్యలు చేపట్టారు. ప్యారాగ్లైడింగ్, మైక్రో లైట్ ఎయిర్ క్రాప్ట్స్‌పై నిషేధం విధించారు. ప్రధాని రాక సందర్భంగా ఐఎస్‌బీ విద్యార్ధుల సామాజిక మాధ్యమ ఖాతాలపై పోలీసులు దృష్టి సారించారు. ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక భావాలు కలిగి ఉన్నట్లు గుర్తిస్తే..వారికి హెచ్చరికలు చేస్తున్నట్టు సమాచారం. ప్రధాని చేతుల మీదుగా పట్టాలు అందుకునే 10మంది విద్యార్ధుల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని రాక సందర్భంగా... రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.