పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ఎనిమిదేళ్ల కిందట కేంద్రం ప్రత్యేక చట్టం చేసింది. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులు ఠాణాలకు వెళ్లక ముందే.. వారు విధులు నిర్వహిస్తున్న చోట్ల వారి ఆవేదనను ఆలకించేందుకు అంతర్గత ఫిర్యాదు కమిటీలున్నాయి. బాధితులను లైంగికంగా వేధించిన వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలున్నాయి. అయినా ఉద్యోగ భద్రత.. బాస్‌ల ఆధిపత్యం, బదిలీ చేస్తారన్న భయంతో బాధితులు వేధింపులను మౌనంగా భరిస్తూ అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. వాటిని భరించలేని వారు ఉద్యోగాలు వదిలిపెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పోలీసుల దృష్టికి రాకుండా నాలుగ్గోడల మధ్యే సమాధి అవుతున్నాయి.
గట్టిగా బుద్ధి చెప్పాలనే..
ఎన్ని చట్టాలున్నా నిందితులను గట్టిగా శిక్షించాలంటే.. బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలా వారికి అవగాహన కల్పించేందుకు పోలీసుల సామాజిక మాధ్యమాల్లో ‘చాలు... ఇక చాలు’(ఎనఫ్.. ఈజ్ ఎనఫ్)పేరుతో పోస్టర్లు, లఘుచిత్రాలతో ప్రచారం చేస్తున్నారు. "పనిచేస్తున్న చోట ఎవరైనా సమానమే. యువతులు, మహిళలు ఫిర్యాదు చేస్తే నిందితుడిపై చర్యలు తీసుకుంటారు. బాధితులు పోలీసుల వద్దకు రాకుండానే 94906 16555 నంబర్‌కు వాట్సప్ చేయవచ్చు" అని పోలీస్ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: