నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. వాళ్లబ్బాయి కార్యాలయంలో సహోద్యోగికి కరోనా పాజిటివ్ రాగా.. వీరి కుటుంబ సభ్యులంతా ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్నారు. కుమారుడు సహా ఇతర కుటుంబ సభ్యులెవ్వరికీ వైరస్ నిర్ధారణ కాలేదు కానీ.. ఈ ఉద్యోగికి మాత్రం పాజిటివ్ అని నివేదిక వచ్చింది. రెండు రోజుల తర్వాత మరో ల్యాబ్‌లో నమూనాలివ్వగా.. నెగెటివ్‌గా తేలింది.
విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసుకు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగా.. నమూనాలిచ్చారు. వైరస్ లేదని ఫలితాలొచ్చాయి. రెండు రోజుల తర్వాత లక్షణాలు తీవ్రమయ్యాయి. మళ్లీ పరీక్ష చేయించారు. ఈసారి కరోనా నిర్ధారణ అయింది.
ఫలితాల నిర్ధారణ ఎలా?
సాధారణంగా గొంతు నుంచి స్వీకరించిన నమూనాను ‘రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్‌టీ పీసీఆర్) విధానంలో ప్రయోగశాలలో పరీక్షిస్తుంటారు. ఇందులో ‘సైకిల్ ఆఫ్ త్రెషోల్డ్(సీటీ)’ విలువ(వ్యాల్యూ) ఎంతనే దానిపైనే కరోనా వైరస్ తీవ్రతను అంచనా వేస్తారు.
- ఈ విధానంలో వైరస్ ‘ఆర్‌ఎన్‌ఏ’ను రెట్టింపు స్థాయిలో విస్తరించే దిశగా (ఎక్స్‌పొనెెన్షియల్ ఆంప్లిఫికేషన్) ప్రోగ్రాంను సమయానుకూలంగా అమర్చుతారు.
- ఈ ప్రోగ్రాం ఒకసారి పూర్తవడాన్ని వైద్య పరిభాషలో ‘ఒక సైకిల్’ అంటారు. ఏ సైకిల్ వద్ద వైరస్‌ను గుర్తిస్తారనే దాన్ని బట్టి తీవ్రతను అంచనా వేయొచ్చు.
- సాధారణంగా వైరల్ లోడ్ (వైరస్ తీవ్రత)ను నిర్ధారించడానికి పరికరంలో 40 సైకిల్స్‌ను గరిష్ఠంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ తీవ్రత అధికంగా ఉంటే 20 సైకిల్స్‌లోపే గుర్తిస్తుంది. మధ్యతరహాలో ఉంటే.. 20-30 సైకిల్స్‌లోపు గుర్తిస్తుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే 35-40 సైకిల్స్‌లోపు తెలుస్తుంది. 40 సైకిల్స్ దాటితే.. నెగెటివ్‌గా నిర్ధారిస్తారు.
వైరస్ తీవ్రత ఎంత?
ప్రస్తుతం నిర్ధారణ పరీక్షల ఫలితాల్లో వైరస్ తీవ్రత ఎంతో ఇవ్వడం లేదు. కేవలం పాజిటివ్, నెగెటివ్ అని నివేదికలో నమోదు చేస్తున్నారు. దీనివల్ల అత్యవసర చికిత్స అవసరమైన వారిని కూడా సాధారణంగానే పరిగణించాల్సి వస్తుంది. కొందరు చూడటానికి ఆరోగ్యవంతులుగా కనిపించవచ్చు. వారిలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. కొందరిలో అధిక రక్తపోటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుండొచ్చు. అందుకే ఫలితాల్లో స్వల్ప, మాధ్యమిక, తీవ్ర.. ఇలా స్థాయుల్లో విభజించి ఇవ్వడం వల్ల వారిలో వైరస్ తీవ్రత ఎంత ఉందనేది ముందే గుర్తించి, అవసరమైన చికిత్స అందించడానికి వీలవుతుంది.
ఫలితాలు మారడానికి కారణాలు?
బాధితుని నమూనాల స్వీకరణ చాలా ముఖ్యం. తీసేటప్పుడు గొంతు లోపలికి వెళ్లాలి. అలా కాకుండా పైపైనే నమూనా తీస్తే.. గొంతులో వైరస్ ఉన్నా నెగెటివ్ ఫలితం రావడానికి అవకాశాలుంటాయి. మళ్లీ నమూనాలు జాగ్రత్తగా తీసినప్పుడు పాజిటివ్ రావచ్చు.
- వైరస్ ఎక్స్‌పోజ్ అయిన 4-7 రోజుల్లో సాధారణంగా ఒంట్లో వైరస్ తీవ్రత పెరుగుతుంది. ఈ కాలాన్ని ‘పొదిగే కాలం’ అంటారు. ఆలోపు వైరస్ సాధారణంగానే ఉండొచ్చు. ఈ సమయంలో నమూనాలు సేకరించినా.. ఫలితం నెగెటివ్ రావచ్చు. మూడు నాలుగు రోజుల తర్వాత నమూనాలిస్తే.. తీవ్రత పెరిగి పాజిటివ్ వచ్చే అవకాశాలున్నాయి.
- ఎలాంటి లక్షణాలు లేకున్నా.. వైరస్ ఒంట్లోకి ప్రవేశించిన 10-12 రోజుల్లో నమూనాలిస్తే.. పాజిటివ్‌గా నిర్ధారణ కావొచ్చు. లక్షణాలు లేవు కాబట్టి మరో రెండు రోజుల వ్యవధిలో మరోసారి నమూనాలిస్తే.. అప్పుడు తీవ్రత తగ్గి నెగెటివ్‌గా రావచ్చు.
- లక్షణాలు లేనివారిలో సాధారణంగానే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిలో 7-10 రోజుల్లో పాజిటివ్‌గా వచ్చి, మరో రెండు రోజుల్లోనే ఆ వైరల్ తీవ్రత తగ్గిపోవచ్చు.
పరీక్షలు చేయడమే కీలకం..
- కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే సిబ్బంది పాత్ర కీలకం. పెద్ద సంఖ్యలో నమూనాలు ఒకేసారి ఒకేచోటుకు వచ్చినప్పుడు.. వాటికి సరైన రీతిలో నమోదు ప్రక్రియ (లేబులింగ్) చేశారా? అనేది ముఖ్యం. అవసరమైన మానవ వనరులు లేకపోతే.. ఇక్కడా తప్పులు దొర్లే అవకాశాలుంటాయి.
- ప్రయోగశాలలో పరికరాలను ఎప్పటికప్పుడు సామర్థ్య పెంపు పరీక్షలు నిర్వహించాలి.
- నమూనాను నిర్దేశించిన పరిమాణం కంటే తక్కువగా వేసి పరీక్షించినా ఫలితం నెగెటివ్ రావచ్చు.
- ప్రయోగశాలలను కూడా ఇన్‌ఫెక్షన్ రహితంగా కనీసం వారానికి ఒకసారి శుభ్రపరుచుకోవాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్ ఇతర నమూనాలకూ వ్యాప్తి చెంది.. అవి పాజిటివ్‌గా వచ్చే ప్రమాదముంది.
- నమూనాలపై గుర్తింపు కోడ్ వేయడంలో పొరపాటు జరిగినా.. ఒకరి నమూనా మరొకరికి వస్తుంది. ఫలితాలు కూడా తారుమారయ్యే ప్రమాదముంది.
- నమూనాలను నిర్ణీత ఉష్ణోగ్రతలో భద్రపరచాలి. అలా చేయకుండా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచితే.. ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండదు. సరిగ్గా నిల్వ చేయకపోతే.. వైరస్ చచ్చిపోయి, పాజిటివ్ ఉన్నా నెగెటివ్‌గా చూపిస్తుంది.
ఇవీ చూడండి: మరో 33 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు బల్దియా ప్రకటన